ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రజలకు ఇది ఓ రకంగా చివరి అవకాశం. ఇళ్లు, ఒళ్లు కాపాడుకునేందుకు వచ్చిన చివరి అవకాశం.
గతంలో ఎవరు అధికారంలోకి వస్తే ఏమవుతుందిలే … అంతా ఒకటే అనుకునేవారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా తమకు చేతనయినంతలో అభివృద్ధి పనులు చేసి.. ప్రజలకు అంతో ఇంతో బతుకు భరోసా ఇచ్చేవి. అందుకే అలా అనుకునేవారు. కానీ నయా క్రిమినల్ మైండ్ రాజకీయ నేతలు అధికారం వచ్చిందంటే.. మొత్తం ప్రజల మీద.. వారి ఆస్తుల మీద హక్కు రాసిచ్చినట్లుగా ఫీలవుతున్నారు. అడ్డగోలు చట్టాలు చేసుకుని.. విరుచుకుపడేందుకు రెడీ అయ్యారు.
ప్రజలకు రాజ్యాంగం, చట్టం నుంచి రక్షణ ఉంటుందన్న భరోసా ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా పోయింది. కోర్టు ఆదేశాలను పట్టించుకునే దిక్కు లేదు. అవినీతిలో భాగం పంచేసి ఓ ముఠాను తయారు చేసుకుని పాలన చేశారు. మద్యం తో ఎన్ని వేల మంది ప్రాణాలు పోయాయో.. ఎంత మంది అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రతి ఊరు.. కాలనీల్లో కళ్ల ముందు కనిపిస్తోంది. ఇది వైపరీత్యం. ఆస్తులు లాగేసుకునే చట్టాలు తేవడం ఘోరం.
ఏ ప్రభుత్వాలూ కూడా చేయనంతటి ఘోరాలను జగన్ సర్కార్ చేసింది. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. ప్రజలకు తమను తాము కాపాడుకునే అవకాశాల్ని ఇవ్వడం. అలాంటి అవకాశం ప్రజలకు వచ్చింది. ఇక ఉపయోగించుకోవడం ప్రజల వంతు.