ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువత ఉద్యోగాల కోసం వెదుక్కునేవారిలా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పని చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ లక్ష్య సాధన కోసం ఆరు కొత్త పాలసీలు ప్రకటించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ , ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ , ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ , ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ , ‘ప్లగ్ అండ్ ప్లే’ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలకు ఆమోదం తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు హామీని నెరవేర్చే దిశగా జాబ్ ఫస్ట్ పేరుతోనే అన్ని పాలసీలను రూపొందించారు. ప్రతి పాలసీలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. పెట్టుబడి ఎంత వచ్చిందన్నది కాకుండా ఎంత మందికి ఉద్యోగాలిస్తారన్నది ఈ సారి ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఏపీ యువత ధింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనే నినాదంతో ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదం పాటిస్తున్నామని.. ఉద్యోగాలు చేయడం కాదని, ఉద్యోగాలు కల్పించే వ్యక్తులుగా మారాలనేది తమ లక్ష్యమన్నారు.
ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన కేంద్రం అమరావతిలో ఉంటుందని.. మిగతా ఐదు జోన్లలో ఐదు కేంద్రాలను రతన్ టాటా పేరుతో ఏర్పాటుచేస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే నెలలో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ప్రకటించనున్నారు.