తెలుగు360 రేటింగ్: 2/5
సినిమాకి ఓ కథ ఉండాలి.
కథలో ఓ హీరో ఉండాలి.
హీరోకి ఓ యాటిట్యూడ్ ఉండాలి.
అలా అయితే… అర్జున్ రెడ్డిలు పుట్టుకొస్తారు.
కానీ..
యాటిడ్యూట్ ఉన్న ప్రతీ హీరోకీ కథని తోకలా తగిలించకూడదు.
ఇలా తీస్తే… తిప్పరా మీసం లాంటి సినిమాలే తయారవుతాయి.
అర్జున్ రెడ్డిలో హీరో గెడ్డం పెంచాడు
మందు కొట్టాడు
డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు
– అయితే ఏదైనా కథ చుట్టూనే తిరిగాడు. కాబట్టి, జనం చూశారు. తన వ్యసనాల కంటే, అందులోంచి పుట్టిన పర్యవసానాల కంటే, ఎమోషన్‌నే ఎక్కువ అర్థం చేసుకున్నారు. అందుకే అర్జున్ రెడ్డిని నెత్తిమీద పెట్టుకున్నారు.
ఇందులోనూ.. హీరో గెడ్డం పెంచాడు
మందు కొట్టాడు
డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు.
– కానీ కేవలం వీటి చుట్టూనే తిరిగాడు. ఎమోషన్ని పూర్తిగా మిస్స్ అయిపోయాడు. అందుకే.. అర్జున్ రెడ్డిలా మీసం తిప్పలేకపోయాడు.
కథగా చెప్పుకుంటే… కాస్త ఆర్థ్రత ఉన్న కథే. ఓ కొడుకు. చెడు వ్యసనాలకు బాసిసై – అమ్మకి దూరంగా పెరగాల్సివస్తుంది. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అమ్మ తనని దూరం చేసిందన్నది ఆ కొడుకు కోపం. అందుకే.. అమ్మ ని చూడ్డానికి, ఆమెతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడడు. కానీ ఆ అమ్మ ఇచ్చే డబ్బు మాత్రం కావాలి. తనకెప్పుడు డబ్బులు అవసరం అయినా.. తల్లికి పీక్కుతింటుంటాడు. ఆ తల్లికి మాత్రం కొడుకంటే అమితమైన ప్రేమ. అందుకే.. అడిగినప్పుడల్లా తల తాకట్టుపెట్టయినా డబ్బులిస్తుంటుంది. బెట్టింగ్‌లో 30 లక్షలు పొగొట్టుకుని, అది ఇవ్వాల్సిందేనని తల్లి దగ్గర దబాయిస్తాడు. తల్లిపై ఫోర్జరీ కేసు కూడా వేసి, కోర్టుకు లాగుతాడు. మరోవైపు చెడు వ్యసనాల వల్ల తన జీవితం మొత్తం అధః పాతాళానికి జారిపోతుంది. వీటి నుంచి ఆ కొడుకు బయటపడ్డాడా, లేదా? ఇలాంటి కొడుకుని ఆ తల్లి ఎందుకు భరిస్తుంది? ఈ మబ్బులు వీడి, వ్యసనాల్ని వదిలి కొడుకు ప్రయోజకుడు అయ్యాడా, లేదా? అనేదే కథ.
లైన్లు ఎన్నయినా పుట్టుకొస్తాయి. దానికి ట్రీట్మెంట్ ముఖ్యం. తల్లిపై కోపంతో చెడువ్యసనాలకు బాసినన కొడుకు కథ ఇది. తిరిగి ఆ తల్లి గొప్పదనం తెలుసుకుని ఎలా దగ్గరయ్యాడన్నది అసలు పాయింట్. అయితే… దీన్ని ఎలా చెప్పకూడదో అలా చెప్పాడు. అర్జున్‌రెడ్డి ప్రభావమో, లేదంటే యూత్ ఎక్కువగా `రా` సన్నివేశాలకు కనెక్ట్ అవుతున్నారన్న భ్రమో తెలీదు గానీ, ఈ సినిమా మేకింగ్ విషయంలో, హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అర్జున్ రెడ్డి ని ఫాలో అయిపోయాడు దర్శకుడు. ఇందులో హీరో తాగుతాడు.. తాగుతూనే ఉంటాడు. పైగా డ్రగ్స్‌కి బానిస. ఆ మత్తులో వేసే చిందులు తెరపై చూసి తీరాల్సిందే. ప్రేమించిన అమ్మాయిని డగ్స్ మత్తులో అనుభవించాలని చూస్తాడు. అమ్మ సంకతం ఫోర్జరీ చేసి, కోర్టుకు లాగుతాడు. ఇన్ని అవలక్షణాలు చూసినప్పుడు హీరో పాత్రపై జాలి ఏమాత్రం కలగదు. తాను మరింత ఊబిలో కూరుకుపోతున్నా.. `అరె..` అనిపించదు. అలాంటప్పుడు ప్రేక్షకుడు ఏ పాత్రకు కనెక్ట్ అవ్వాలి?
అసలు తల్లిపై కొడుకు ద్వేషం పెంచుకుని, పద్నాలుగేళ్లు దూరంగా ఉండడానికి ఎలాంటి బలమైన కారణం కనిపించదు. ఒకవేళ దర్శకుడు బలవంతంగా కారణం చొప్పించినా – అదేమాత్రం అతకలేదు. బెట్టింగ్ వ్యవహారాలు, ఓ చీకటి గదిలో హీరోని ఏడు రోజులు బంధించడం – ఇవన్నీ మింగుడు పడని సన్నివేశాలు. ఏడు రోజులు తిండి, నీళ్లు లేకుండా చేస్తే… ఓ మనిషి కదలడానికి కూడా ఓపిక ఉండదు. అలాంటిది షర్టర్ ఓపెన్ చేసి, నీళ్ల ట్యాప్ వరకూ నడుచుకుంటూ వస్తాడు. హీరో కదా. ఓకే అనుకోవాలి. హీరోయిన్ పాత్రకంటూ ఓ క్యారెక్టరైజేషన్ ఉండదు. హీరో కనిపించి, తన అందం చూసి, ఐ లవ్ యూ చెప్పగానే – అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు ప్రేమించేస్తుంది. దర్శకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తెరపైకొచ్చింది. ప్రధమార్థం మొత్తం హీరో క్యారెక్టరైజేషన్‌కే సరిపోయింది. ఇంట్రవెల్ ముందు నడిచిన పది నిమిషాల ప్రహసనం చూసి తీరాల్సిందే. డ్రగ్స్ మత్తులో హీరో వేసే చిందులవి. దాన్ని కామెడీ అనుకోవాలా? లేదంటే దిగజారిపోతున్న హీరో క్యారెక్టరైజేషన్ అనుకోవాలా? దర్శకుడికే తెలియాలి.
ద్వితీయార్థం మర్డర్ చుట్టూ నడిపించాడు. చివర్లో ఓ ట్విస్టు. నిజానికి ఆ ట్విస్టు తరచూ సినిమాలు చూసే వాళ్లెవరైనా ఊహించేస్తారు. దాన్ని నమ్ముకుని ఓ సినిమా తీయడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే.
శ్రీవిష్ణు తన వరకూ బాగానే చేశాడు. తన పాత్ర, నటించడానికి స్కోప్ ఉంటే సరిపోతుందనుకుంటే పొరపాటు. కథగా అన్నీ బాగున్నప్పుడే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఈ విషయాన్ని శ్రీవిష్ణు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. తల్లి పాత్రలో రోహిణి నటన అత్యంత సహజంగా ఉంది. కథానాయికకి రంగు ఎక్కువ. అభినయం తక్కువ. మిగిలిన వాళ్లవన్నీ చిన్న చిన్న పాత్రలే.
రాత్రి పూట ఎక్కువ షూటింగ్ చేశారు. కొత్త టెక్నాలజీనో, లేదంటే… కెమెరాకు తక్కువ డబ్బులు ఇచ్చారో తెలీదు గానీ, చీకట్లో తీసిన సన్నివేశాల్లో నాణ్యత కనిపించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో ఉన్న బిల్డప్.. సీన్లో ఉండదు. అసలు తిప్పరా మీసం అనే టైటిల్‌కీ, ఈకథకీ ఉన్న సంబంధమే అర్థం కాదు. దర్శకుడు ఏం చెప్పి శ్రీ విష్ణుని ఒప్పించాడో తెలీదు. ప్రేక్షకుడికి కాస్త కూడా రిలీఫ్ ఇవ్వకుండా – యమ సీరియస్‌గా సినిమా సాగిపోతుంటుంది. ఆ సీరియెస్నెస్లో నిజంగా సీరియెస్నెస్ ఉంటే చూడ్డానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ.. ఎమోషన్ లేని డ్రామా ఏమాత్రం నిలబడదు. ఈ తిప్పరా మీసం పరిస్థితి కూడా అంతే.
ఫినిషింగ్ టచ్:డూప్లికేట్ మీసం
తెలుగు360 రేటింగ్: 2/5