కేసీఆర్ మళ్లీ ధర్డ్ ఫ్రంట్ ఆలోచనల్లో ఉన్నారు. కలసి వచ్చేందుకు ఓవైసీ రెడీగా ఉన్నారు. ఈ విషయాన్ని ఓవైసీనే ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉందని… కేసీఆర్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్‌తో భర్తీ చేస్తామని ఓవైసీ చెబుతున్నారు. ఎన్డీయే, ఇండియా కూటముల్లోని రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేవని… .. మాయావతి, కేసీఆర్ వంటి సెక్యులర్ నేతలు ఆయా ఫ్రంట్లలో లేరని ఓవైసీ చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రకు చెందిన అనేక పార్టీలు ఈ ఫ్రంట్లల్లో సభ్యత్వం తీసుకోలేదని వారందర్నీ కలుపుకుని వెళ్తామని చెబుతున్నారు. దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్‌కు ప్రాధాన్యం ఏర్పడిందని దీనికి కేసీఆర్ నాయకత్వం వహించాలని ప్రజలు ఆశిస్తున్నారని తేల్చేశారు.
కేసీఆర్ ఇప్పటికే ఎన్ని ఫ్రంట్ల ఆలోచనలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఆయన చాలా సార్లు చాలా రాష్ట్రాలు తిరిగారు. ప్రత్యేక విమానం ఖర్చులు మిగిలాయి తప్ప కలసి వచ్చిన వారెవరూ లేరు. దీంతో ఆయన చివరికి జాతీయ పార్టీ పెట్టుకున్నారు. అయినా లోకల్ రాజకీయమే చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మళ్లీ మూడో కూటమి ఆలోచనలు ఉన్నాయని… ఓవైసీ ద్వారా బయటపెడుతున్నారు.
ఇప్పటికే దేశంలో ఉన్న అతి కీలకమైన రాజకీయ పార్టీలన్నీ.. ఏదో ఓ కూటమిలో చేరిపోయాయి. మూడో కూటమిలో చేరడానికి పార్టీలేమీ సిద్ధంగా లేవు. మాయవతి వంటి వారు కేసీఆర్ తో చేతులు కలుపుతారన్న గ్యారంటీ లేదు. యూపీలో మాయవతి పూర్తిగా పట్టు కోల్పోయే పరిస్థితికి వచ్చారు. కేసీఆర్ ప్రస్తుతం బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు. కాంగ్రెస్ తో సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్డ్ ఫ్రంట్ అటే…. బీజేపీ కోసమేనని విశ్లేషించే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. అదే జరుగుతోంది.