తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎంపీలు… ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఈ మేరకు..రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని కలిసి లేఖ ఇచ్చారు. తమను టీడీపీ సభ్యులుగా కాకుండా.. ప్రత్యేక వర్గంగా చూడాలని కోరారు. టీడీపీకి ఆరుగురు రాజ్యసభలో ఉన్న సభ్యుల్లో నలుగురు సభ్యులు బీజేపీకి అనుబంధంగా ఉండేందుకు నిర్ణయించారు. ఈ వ్యవహారం తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. వెళ్తున్న నలుగురులో ముగ్గురు వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు. వీరిలో సీఎం రమేష్, సుజనా చౌదరి చంద్రబాబు కోటరిగా పేరు పడ్డారు. తెలంగాణకు చెందిన గరికపాటి మోహన్ రావు మొదట్నుంచి తెలుగుదేశంలో ఉన్నారు. ఆయనకు పదవీ కాలం ముగిసే సమయం వచ్చింది. చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ‘వస్తున్న మీ కోసం’ పాదయాత్రను గరికపాటి మోహన్ రావు వెన్నంటే ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సుజనా చౌదరి కూడా చంద్రబాబుకు అండగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా సుజనా చౌదరి పార్టీ తరపున అభ్యర్థులతో నిరంతరం టచ్ లో ఉన్నారు. పార్టీ ఘోర పరాజయపాలుకావటం, ఇదే సమయంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ సంస్థలపై ఈడీ, సీబీఐ దాడులు జరుగుతుండటంతో వీరివురూ బీజేపీలోకి వెళ్లిపోతారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. మరోవైపు గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ లు కూడా బీజేపీ వైపు మొగ్గారు. నిజానికి చంద్రబాబు కోటరీలో.. సుజనా చౌదరి, సీఎం రమేష్ ముఖ్యులు. ఏ పని అయినా.. వారి చేతుల మీదుగా జరుగుతుందనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో వారే పార్టీ ఫిరాయించడం.. టీడీపీకి దూరమవడం.. ఆసక్తికరమైన అంశమే. పారిశ్రామికవేత్తలని..పార్టీకి అండగా ఉంటారని.. పక్కన పెట్టుకుంటే.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని.. టీడీపీ నేతలు అంటున్నారు.
నేతల ఫిరాయింపులపై… తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు యూరప్ నుంచి ఫోన్ లో ముఖ్యనేతలతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని వీడాలనుకుంటున్న నేతలతోనూ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అయితే నిర్ణయం తీసుకున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీరు టీడీపీని వీడి బీజేపీలో చేరడం మాత్రం… టీడీపీలో క్రియాశీలకంగా ఉండే వారికి… కాస్త ఆనందాన్నిస్తోందని చెప్పాలి. వీరి వల్లనే పార్టీ నష్టపోయిందనే అభిప్రాయం ఉన్న వారు.. మరితం ఆనందంగా ఉన్నారు. వెళ్లిన వాళ్లకి ప్రత్యేకమైన ప్రజాబలం ఏమీ లేకపోవడంతో.. బీజేపీ వారిని ఉపయోగించుకుని చేసేదేమీ లేదని కూడా అంటున్నారు.