హైదరాబాద్: దివంగత ప్రధాని జవహర్లాల్ ‘చాచా’ నెహ్రూలాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా పిల్లలంటే విపరీతమైన ప్రేమాభిమానాలు. చిన్న పిల్లలు కనబడితే కొద్దిసేపు వారితో గడపకుండా ఉండరు. గత ఎనిమిదేళ్ళుగా అమెరికా అధ్యక్షుడి హోదాలో దేశంలోగానీ, విదేశాలకు వెెళ్ళినాగానీ ఆయన పిల్లలతో ఆడుకున్నప్పుడు, ముద్దాడినప్పుడు తీసిన ఫోటోలతో అమెరికా ఔత్సాహిక పారిశ్రామికవేత్త మైఖేల్ స్కోల్నిక్ ట్విట్టర్లో #ObamaAndKids పేరుతో ఒక హ్యాష్‌ట్యాగ్ సృష్టించారు. అది ఇప్పుడు ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఒబామా ముద్దాడిన పిల్లలలో ఇండియన్ అమెరికన్స్, ఆఫ్రికన్ అమెరికన్స్తోసహా అన్ని రంగులవారు, జాతులవారు ఉన్నారు. ఆ ఫోటోలలో పసిపిల్లలతో ఆయన చేసిన అనేక ఫీట్లలో కొన్ని నవ్వుపుట్టించేవిధంగా ఉన్నాయి.
ఒబామాకు మాలియా(17), సాషా(14) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అధ్యక్ష పదవినుంచి పదవీ విరమణ చేసిన తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అనేకసార్లు ఇంటర్వూలలో చెప్పారు. అమెరికా అధ్యక్షుల చరిత్రలో పిల్లలపై ఇంత ప్రేమాభిమానాలున్న వ్యక్తి మరొకరు లేరని అంటున్నారు.