తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత దామోదర్ రెడ్డి పార్టీని వీడుతున్నారు. అంతేకాదు, తెరాసలో చేరుతున్నట్టుగా కూడా ప్రకటించారు. కారణం అదే… నాగం జనార్థన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడమే. ఈ చేరికను మొదట్నుంచీ దామోదర్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ లో స్థానిక నేతగా ఉన్న తన అభిప్రాయానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆత్మ గౌరవ సమస్యగా భావించాననీ, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని దామోదర్ రెడ్డి చెబుతున్నారు. వరుస చేరికలతో కాంగ్రెస్ బలపడుతోందన్న భావన ఏర్పడుతున్న ఈ తరుణంలో, ఒక సీనియర్ నేత, పార్టీకి దాదాపు రెండు దశాబ్దాలుగా కట్టుబడి పనిచేస్తున్న నాయకుడు వెళ్లిపోవడం గమనార్హం.
ఇక్కడ మరో కోణం కూడా గమనించాలి..! నాగం చేరికను మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ లోని డీకే అరుణ వర్గం. దామోదర్ కూడా డీకే అరుణ వర్గీయులే అనేది తెలిసిందే. నాగం చేరికను అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళ్లి మరీ ఈ వర్గీయులు ఫిర్యాదు చేసొచ్చారు కూడా! కానీ, పార్టీలోని జైపాల్ రెడ్డి వర్గం చక్రం తిప్పిందనీ… అందుకే నాగం చేరిక జరిగిపోయిందన్న కథనాలూ ఉన్నాయి. పార్టీలో తనను అంతర్గతంగా దెబ్బతియ్యాలనీ, తన వర్గానికి ప్రాధాన్యం తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఒక వర్గం కుట్ర పన్నుతోందంటూ డీకే అరుణ ఈ మధ్య బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీని వీడుతున్న క్రమంలో దామోదర్ కూడా అదే మాట చెబుతున్నారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించారని దామోదర్ మీడియాతో చెప్పారు. ఆమెను బలహీన పరచాలన్న ప్రయత్నం కొంతమంది చేస్తున్నారనీ, తాను పార్టీ నుంచి బయటకి వెళ్తున్నందుకు ఆమె చాలా బాధపడుతున్నారని దామోదర్ చెప్పారు.
దామోదర్ బయటకి వెళ్లడం అనేది కేవలం ఆయన ఒక్కరి ఆత్మ గౌరవ సమస్యగా మాత్రమే కనిపించడం లేదు, దాంతోపాటు డీకే అరుణ పంతం కూడా తెరవెనక ఎక్కడో బలమైన పాత్ర పోషించినట్టుగా అనిపిస్తోంది! తన వర్గానికి ప్రాధాన్యత దక్కకపోతే ఇలానే జరుగుతుందనే సంకేతాలు కాంగ్రెస్ హైకమాండ్ కు అందించాలన్న వ్యూహమేదో ఉందని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. తన వర్గాన్నీ, లేదా తన అభిప్రాయాన్ని గౌరవించకపోతే అరుణ ఏం చేస్తారనేది దామోదర్ పార్టీని వీడటం ద్వారా స్పష్టమౌతున్నట్టుగా కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకే కొంతమంది నేతల్ని చేర్చుకుంటున్నారని అరుణ ఎప్పట్నుంచో ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డి పార్టీ వీడటాన్ని ఆయన ఒక్కరి అసంతృప్తికి జరిగిన ప్రతిచర్యగా చూడలేం కదా! తాజా పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ కోణం నుంచి చూస్తుందో మరి.