హైదరాబాద్: దీపావళి మరుసటి రోజున సదర్ ఉత్సవాన్ని యాదవులు ఘనంగా జరుపుకోవటం భాగ్యనగరం సంస్కృతిలో ఓ భాగం. ఈ ఏడాదికూడా యాదవులు సదర్ ఉత్సాహాన్ని ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో యువకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. పూలు, గజ్జెలు, గవ్వలతో అందంగా ప్రత్యేకంగా అలంకరించిన తమ దున్నపోతులతో యాదవులు విన్యాసాలు చేయించారు. ఈ సంవత్సరం హర్యానానుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘యువరాజ్’ అనే దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముర్రా జాతికి చెందిన దున్నపోతు యువరాజ్ 12 సార్లు నేషనల్ ఛాంపియన్గా నిలిచింది. యూరప్లోకూడా ఇది బాగా పాపులర్. 2007లో పుట్టిన ఈ మహా దున్నపోతు వీర్యానికి టర్కీ, స్కాట్లాండ్, బ్రెజిల్ వంటి దేశాలలో ఎంతో డిమాండ్ ఉంది. నాలుగు రోజులకొకసారి దీనినుంచి వీర్యాన్ని తీస్తారు. నైట్రోజన్ సిలిండర్లలో భద్రపరిచి ఇంజెక్షన్ల రూపంలో విక్రయిస్తారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రు.400. ఒక్కసారి విడుదలయ్యే వీర్యంపైన రు.3 నుంచి రు.4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. హర్యానా నుంచి తీసుకురావటానికే రు.3 లక్షలు ఖర్చయింది. దీని దాణాకు రోజుకు రు.5 వేలు ఖర్చవుతుంది. గడ్డి, దాణాతో పాటు బాదం, పిస్తా, కాజు, బెల్లం, క్యారెట్ , 20 లీటర్ల పాలు, 8 కిలోల యాపిల్స్ ఆహారంగా పెడతారు. దీని బరువు 1600 కిలోలు, ఎత్తు 6.5 అడుగులు, పొడవు 14 అడుగులు. ఇది యాజమానికి ఏడాదికి రు.1 కోటి సంపాదించిపెడుతుంది. దీనిని చూడటానికి జనం భారీసంఖ్యలో తరలివచ్చారు. దానితో ఫొటోలు దిగటానికి పోటీలు పడ్డారు. ఈ మహా దున్న పోతు హైదరాబాద్లో వారం రోజులు ఉంటుంది.