ప్రేక్షకుడి పల్స్ కనిపెట్టేవాడే దర్శకుడు. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి రాజమౌళికి. అందుకే వరుస హిట్లతో… దక్షిణాది నెం.1 దర్శకుడు అనిపించుకున్నాడు. రాజమౌళి సక్సెస్ సీక్రెట్లు చాలా ఉన్నాయి. వాటిలో… ప్రేక్షకుడ్ని ప్రిపేర్ చేయడం ఒకటి. తన సినిమాకి సంబంధించి కథ ముందుగా చెప్పేసి `నేను ఇలాంటి సినిమా తీస్తున్నా.. చూసుకో` అని ముందే సిద్ధం చేసేస్తుంటాడు రాజమౌళి. `మగధీర` కథ ముందు మీడియాకి చెప్పేశాడు. `ఈగ`కీ అంతే. `మర్యాద రామన్న` విషయంలోనూ ఇదే జరిగింది. `బాహుబలి`కి మాత్రం కథ దాయాల్సివచ్చింది. `ఆర్.ఆర్.ఆర్`కీ అదే పంథా పాటించాడు రాజమౌళి.
ఈ సినిమాకి సంబంధించి కొన్ని కథలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ అడవి దొంగగా కనిపిస్తాడని, అతన్ని పట్టుకునే పోలీస్ అధికారిగా చరణ్ నటిస్తాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సినిమా ప్రారంభోత్సవంలో ఈ కథ గురించి క్లూ ఇస్తాడేమో అనుకున్నారంతా. కానీ… రాజమౌళి అలాంటి ప్రయత్నాలేం చేయలేదు. నిజానికి కథగా రాజమౌళి చాలా చిన్న పాయింట్ తీసుకున్నాడని, కానీ విజువల్‌గా ఓ స్థాయిలో చూపించబోతున్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంత చిన్న పాయింట్ ముందే లీక్ చేయడం మంచిది కాదన్నది రాజమౌళి ఆలోచన. అందుకే కథ విషయంలో బయట ఎంత ప్రచారం జరుగుతున్నా… దాని గురించి ప్రస్తావించకుండా వదిలేశాడని తెలుస్తోంది. `కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు` అనే ప్రశ్న యేడాది పాటు చక్కర్లు కొట్టినా… `సమాధానం తెరపైనే చూడండి` అంటూ మొండిగా కూర్చుండిపోయాడు రాజమౌళి. ఈసారీ అదే స్టైల్ ఫాలో అయిపోతున్నాడేమో.