సమ్మర్ సీజన్ అంటే ఎలా ఉండాలి? కొత్త సినిమాలతో కళకళలాడాలి. ఉష్ణోగ్రతలతో వసూళ్లు పోటీ పడాలి. కానీ ఈ వేసవి మాత్రం నీరసంగా నిస్తేజంగా గడిచిపోతోంది. ఏపీలో ఎలక్షన్ల హంగామా ముందు బాక్సాఫీసు చిన్నబోతోంది. సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. అందుకే కొత్త సినిమాల కళ లేక.. థియేటర్లు బోసిబోతున్నాయి. గతవారం థియేటర్లలో సినిమాలేం రాలేదు. ఈసారీ అంతే. ఒకే ఒక్క సినిమా ‘పారిజాత పర్వం’ విడుదలకు సిద్ధమైంది. ఒకట్రెండు చిన్న సినిమాలు ఉన్నా, వాటిపై పెద్దగా ఫోకస్ లేదు.
సునీల్, చైతన్య రావు, శ్రద్దా దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పారిజాత పర్వం’. ఇదో కిడ్నాప్ డ్రామా. సంతోష్ కుంభంపాటి దర్శకుడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొంటున్నాయి. ముఖ్యంగా వైవా హర్ష చేసిన కామెడీ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. దీంతో పాటు శరపంజరం, మారణాయుధం అనే రెండు చిన్న సినిమాలు బాక్సాఫీసు ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో స్టార్ బొమ్మ పడాలంటే, మళ్లీ బాక్సాఫీసుకు జోష్ రావాలంటే ఏపీలో ఎన్నికలు అయిపోవాల్సిందే.