వేసవి సినిమాల జోరు కొనసాగుతోంది. అగ్ర హీరోల సినిమాలతో బాక్సాఫీసు హోరెత్తిపోతోంది. గతవారం ఆచార్య విడుదల అయ్యింది. వచ్చే వారం మహేష్ బాబు సర్కారు వారి పాట వస్తోంది. మధ్యలో ఓ వారం గ్యాప్ వచ్చింది. దాంతో మూడు మీడియం సైజు సినిమాలు ఈ వారాన్ని క్యాష్ చేసుకోవాలని తాపత్రయపడుతున్నాయి. అందుకే ఈవారం మూడు సినిమాలు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా… అశోక వనంలో అర్జున కల్యాణం. ఇదో రొమాంటిక్ కామెడీ సినిమా. తెలంగాణ అబ్బాయికీ, ఆంధ్రా అమ్మాయికీ.. మధ్య పెళ్లి కథ. విశ్వక్ గెటప్ ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంది. ప్రమోషన్లూ బాగానే చేస్తున్నాడు. దానికి తోడు టీవీ 9 వల్ల.. కోట్ల రూపాయల విలువ గల ఫ్రీ పబ్లిసిటీ వచ్చి పడిపోయింది. ఈ వారం వచ్చే సినిమాల్లో దీనిపై గట్టిగా దృష్టి పెట్టొచ్చు.
మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.. శ్రీవిష్ణు. మొన్నా మధ్య చేసిన అర్జున.. ఫల్గుణ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈసారి కాస్త జాగ్రత్త పడుతూ తీసిన సినిమా భళా తందనాన. 200 కోట్ల విలువ గల స్కామ్ కి సంబంధించిన కథ ఇది. బాణం, బసంతి సినిమాలతో తనదంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. సుదీర్ఘ విరామం తరవాత తీసిన సినిమా ఇది. ప్రచార చిత్రాలు బాగుండడంతో అంచనాలు ఏర్పడ్డాయి. క్రైమ్ జోనర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు దీనిపై ఓ లుక్ వేయొచ్చు.
ఇక సుమ పంచాయితీ పెట్టేసింది. సుదీర్ఘ విరామం తరవాత వెండి తెరపైకి వచ్చేసింది. సుమ ప్రధాన పాత్ర పోషించిన సినిమా జయమ్మ పంచాయితీ. శ్రీకాకుళంలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా ప్రధాన ఆకర్షణ.. సుమ. బుల్లితెర కార్యక్రమాలు, యాంకరింగ్ ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది సుమ. తను ఓ సినిమా చేసిందంటే, అందులోనూ.. హీరోయిన్ అంతటి పాత్ర పోషించిందంటే.. కచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. అలా.. ఈ పంచాయితీపై దృష్టి పడింది. దానికి తోడు పవన్, మహేష్, రాజమౌళి.. వీళ్లంతా ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ చేసి పెట్టారు. సుమ కోసమైనా ఓసారి ఈ సినిమా చూడాలని సగటు ప్రేక్షకుడు భావిస్తే.. ఈ సినిమాపై కాసుల జల్లు కురిసే అవకాశం ఉంది.