గతవారం బాక్సాఫీసుకి చేదు అనుభవమే ఎదురైంది. మూడు సినిమాలు వస్తే… మూడూ ఫ్లాపులే. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావల్సినవాడిని, శాకిని, డానికీ – బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. ఈ వారం కూడా ముచ్చటగా మూడు సినిమాలొస్తున్నాయి. అల్లూరి, కృష్ణ వ్రింద విహారి, దొంగలున్నారు జాగ్రత్త…. ఈ మూడూ శుక్రవారమే విడుదల అవుతున్నాయి. మూడింటిపైనా మంచి అంచనాలే ఉన్నాయి.
శ్రీవిష్ణు హీరోగా నటించిన `అల్లూరి` ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. పోలీస్ కథలంటే కమర్షియాలిటీకి అడ్డా. ట్రైలర్లో ఆ హంగులు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఫలితంపై శ్రీవిష్ణు కూడా ధీమాగానే ఉన్నాడు. ఇక నాగశౌర్య రొమాంటిక్ కామెడీ జోనర్లో చేసిన సినిమా `కృష్ణ వ్రింద విహారి`. శౌర్యకు ఈ జోనర్ బాగా కలిసొచ్చింది. `అలా ఎలా`తో హిట్టు కొట్టిన అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. తనకీ రొమాంటిక్ ఎంటర్టైనర్లు అచ్చొచ్చాయి. అందుకే వీరిద్దరి కాంబోపై నమ్మకాలు ఏర్పడ్డాయి. కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా `దొంగలున్నారు జాగ్రత్త` కూడా ఈవారమే వస్తోంది. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. కారులో హీరో ఇరుక్కుపోతే ఏమవుతుంది? అనేదే సినిమా కథ. సినిమాలో ఎక్కువ భాగం ఒకే లొకేషన్లో జరుగుతుంది. ఇదో కొత్త కాన్సెప్ట్ అనుకోవొచ్చు. అల్లూరి యాక్షన్ డ్రామా, కృష్ణ వ్రింద విహారి రొమాంటిక్ కామెడీ అయితే… దొంగలున్నారు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా. మూడూ మూడు రుచులు పంచడానికి రెడీ అయ్యాయి. మరి… వీటిలో ప్రేక్షకుల ఓటు దేనికో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాలి.