సంక్రాంతి తరవాత బాక్సాఫీసు దగ్గర కాస్త జోష్ తగ్గడం సహజం. అయితే ఈయేడాది అలాంటి వాతావరణం ఏం కనిపించడం లేదు. ప్రతీ వారం సినిమాలు హడావుడి చేస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరిలోనూ ఆ జోష్ కనిపించబోతోంది. ఫిబ్రవరి 2న ఏకంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవన్నీ చిన్న సినిమాలే. కాకపోతే ఏ పుట్టలో ఏ పాముందో, ఏ సినిమా హిట్టవుతుందో ఎవరు చెప్పగలం? పైగా ఈమధ్య చిన్న సినిమాలే ఎక్కువగా దుమ్ము రేపుతున్నాయి. కాబట్టి… ఈవారం సినిమాలపై ఓ లుక్కు వేయాల్సిందే.
ఈవారం 8 సినిమాలున్నా.. అందరి దృష్టినీ ఆకర్షించేది మాత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’. సుహాస్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ప్రచార చిత్రాలు, పాటలూ బాగున్నాయి. పైగా సుహాస్ సినిమా అంటే ఈరోజుల్లో మినిమం గ్యారెంటీ అనే నమ్మకం కలుగుతోంది. ఈ సినిమా కోసం సుహాస్ రెండుసార్లు గుండు కొట్టించుకొన్నాడు. కథ అంతగా తనని టెప్ట్ చేసింది. ఈవారం సినిమాల్లో దీనికే ఎక్కువ టికెట్లు తెగే ఛాన్సుంది. ప్రచారంలో అన్ని సినిమాలకంటే ఇదే ముందుంది. పెయిడ్ ప్రీమియర్లకూ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకొన్న సోహెల్ నుంచి మరో సినిమా వస్తోంది. అదే `బూట్ కట్ బాలరాజు`. టైటిల్ మాంఛి క్యాచీగా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా అని ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. వినోదం పండితే మినిమం గ్యారెంటీ హిట్ దక్కినట్టే. కిస్మత్, హ్యాపీ ఎండింగ్, ధీర, మెకానిక్, చిక్లెట్స్, గేమ్ ఆన్… ఇలా మరో అరడజను సినిమాలు కూడా బాక్సాఫీసుపై గురి పెట్టాయి. పెద్ద స్టార్లు, హంగామా ఏం లేకపోయినా.. ఈ 8 సినిమాలతో మాత్రం థియేటర్లు తళతళలాడబోతున్నాయి. మరి వీటిలో విజయం దక్కేదెవరికో..?!