దీపావళి పెద్ద పండగే కానీ, బాక్సాఫీసుకి ఎప్పుడూ కలసి రాదు. అందుకే తెలుగులో దీపావళిని టార్గెట్ చేస్తూ చాలా తక్కువ సినిమాలే వస్తుంటాయి. తమిళనాట మాత్రం దీపావళి పెద్ద పండగ. కాబట్టి.. భారీ ఎత్తున అక్కడ సినిమాల్ని విడుదల చేస్తుంటారు. ఈ దీపావళికి మాత్రం తెలుగులో 4 సినిమాలు వరుస కట్టాయి. నాలుగింటిపైనా అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ దీపావళికి బాక్సాఫీసు దగ్గర సిసలైన పండగ చూసే అవకాశం ఉంది.
ఈ దీపావళికి రెండు తెలుగు సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జిన్నా, ఓరి దేవుడా, ప్రిన్స్, సర్దార్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విష్ఱు నటించిన చిన్నా స్ట్రయిట్ తెలుగు సినిమా. ఓరి దేవుడా రీమేక్ అయినా… వెంకటేష్ కీలక పాత్ర పోషించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. శివ కార్తికేయన్ సినిమా ప్రిన్స్ పైనా ఆశలు ఉన్నాయి. ఎందుకంటే శివ కార్తికేయన్ ని ఈమధ్య తెలుగులో గిరాకీ పెరిగింది. దానికి తోడు.. `జాతి రత్నాలు`తో నవ్వించిన అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. ట్రైలర్ కూడా ఆకట్టుకొంది. దీంతో పాటు కార్తి `సర్దార్` కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాలో కార్తి ఆరు గెటప్పులలో కనిపించబోతున్నాడు. కార్తి సినిమాకి తెలుగులో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కాబట్టి.. ఈ దీపావళికి ఈ సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర వసూళ్లు దక్కించుకొనే అవకాశం ఉంది. ఈనెల 21నే ఈ నాలుగు సినిమాలూ వస్తున్నాయి. సోమవారం దీపావళి. అంటే.. వీకెండ్ కి మరో రోజు కలిసొచ్చినట్టే.