తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5
ప్రేమకథల లాజిక్ ఒక్కటే.
కథ గొప్పగా ఉండాల్సిన పనిలేదు
హీరో హీరోయిన్ల కెమెస్ట్రీ పండాలి
కథనంలో ట్విస్టులు ఇవ్వక్కర్లెద్దు
మన ప్రేమ.. గుర్తొస్తే చాలు.
కాలాన్ని వెనక్కి తిప్పి… మన ప్రేమకథని మనకి కొత్తగా పరిచయం చేసేలా ఉండే ప్రేమకథలన్నీ సక్సెస్ అవుతాయి. చరిత్ర తిరగేయండి.. గొప్ప గొప్ప ప్రేమకథా చిత్రాల్లో కథలేం గొప్పగా ఉండవు. దాన్ని మలిచిన తీరే… మనల్ని ప్రేమలో పడేస్తుంది. `తొలిప్రేమ` కూడా అంతే.
కథ
ఆది (వరుణ్‌తేజ్) ఓ రైల్వేస్టేషన్లో వర్ష (రాశీఖన్నా)ని చూస్తాడు. తొలి చూపులోనే ప్రేమిస్తాడు. రైలు ప్రయాణం ముగిశాక… తాను మాయం అయిపోతుంది. మూడు నెలల తరవాత.. ఇద్దరూ అనుకోకుండా ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. అక్కడ వాళ్ల స్టోరీ మళ్లీ మొదలవుతుంది. ఆదికి కోపం ఎక్కువ. వర్షకి ఆలోచన ఎక్కువ. ఆది కోపంలో నిర్ణయాలు తీసుకుంటాడు. వర్ష కనీసం మాట్లాడాలన్నా ఆలోచిస్తుంది. అదే… వీళ్లిద్దరి మధ్య గొడవకు కారణం అవుతుంది. `ఐ హేట్ యూ` చెప్పి.. ఆది వెళ్లిపోతాడు. ఆరేళ్ల తరవాత.. వీరిద్దరిని విధి మళ్లీ కలుపుతుంది. అయితే ఈసారి.. లండన్‌లో! అక్కడ ఏం జరిగింది?? ఇద్దరూ అలానే ఉన్నారా, కొట్టుకున్నారా, విడిపోయారా? అసలు వీళ్ల గొడవకు కారణం ఏమిటి? అనేదే మిగిలిన కథ
విశ్లేషణ
ప్రేమకథా చిత్రాల్లో ఉన్న సౌలభ్యం ఏమిటంటే కనెక్టింగ్ పాయింట్. ఎక్కడో ఓ పాయింట్ దగ్గర ప్రేక్షకులు కనెక్ట్ అయితే చాలు.. కథని ఓన్ చేసుకుంటారు. అలాంటి పాయింట్ ఈ సినిమాలోనూ ఉంది. ప్రేమికులు చిన్న చిన్న విషయాలకే విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం మామూలే. అలాంటి మామూలు కథని `కనెక్టింగ్ పాయింట్` చేసేశాడు దర్శకుడు. ఇంత చిన్న కథని.. ఎమోషన్స్‌తో చెప్పగలిగాడు. కథ ప్రారంభం చాలా నెమ్మదిగా ఉంటుంది. రైల్వే స్టేషన్ సీన్… లెంగ్తీగా సాగుతుంది. కాలేజీలో ర్యాగింగ్ దృశ్యాలు కాస్త రొటీన్ అనిపిస్తాయి. క్రమంగా హీరో, హీరోయిన్ల తాలుకూ క్యారెక్టరైజేషన్లు పూర్తి స్థాయిలో బయట పడ్డాక.. వాళ్లమధ్య సంఘర్షణకు సరైన పాయింట్ రాసుకున్నాడనిపిస్తుంది. సరిగ్గా అందరూ ఊహించినట్టే విశ్రాంతికి ఇద్దరూ విడిపోతారు. మొన్నటికి మొన్న `ఫిదా`లోనూ ఇలాంటి కాన్ఫిట్ పాయింట్ కనిపించింది. అయితే ఆ నేపథ్యం వేరు.. ఇక్కడి కథ వేరు. కాబట్టి.. కథ పాతదే అయినా మన కళ్లని మాత్రం కొత్తగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఎమోషన్ డోస్ ఎక్కువ అవుతుందేమో అనుకుంటారంతా. కానీ మరీ ఏడిపిస్తే ‘టీవీ సీరియల్‌కీ సినిమాకీ తేడా ఏముంది’ అని జనాలు లైట్ తీసుకుంటారని భయపడి ఉంటాడు. మరీ సెంటిమెంట్ జోలికి, విరహగీతాల జోలికి వెళ్లకుండా.. కథని వీలైనంత ఎంటర్టైన్మెంట్ జోడించి చెప్పాలనుకున్నాడు. హైపర్ ఆదిని తీసుకురావడం వెనుక ఉన్న ఎత్తుగడ అదే. జబర్దస్త్ జోకులకు ప్రేక్షకులు బాగా ట్యూన్ అయిపోయినట్టు కనిపిస్తోంది. హైపర్ ఆది కనిపించగానే నవ్వేస్తున్నారు. పంచ్‌లో ఫన్ లేకపోయినా నవ్వేస్తున్నారు. ఆ విధంగా తనవంతు న్యాయం చేసేశాడు. నరేష్ ‘వీళ్లు మనోళ్లే’ అనే ట్యాగ్ లైన్‌తో కాస్త నవ్వించాడు.
ఈ దర్శకుడి దగ్గర కనిపించి మరో మంచి లక్షణం ఏమిటంటే.. సన్నివేశాల్లో డెప్త్ కనిపించని చోటల్లా.. డైలాగులతో తీసుకొచ్చాడు. ప్రియదర్శి పెళ్లి కోసం హీరో హీరోయిన్లు నరేష్‌ని కన్వెన్స్ చేసే చోట, సుహాసిని – వరుణ్‌ల సంభాషణల మధ్య… దర్శకుడి ‘రాత’ పనితనం బాగా నచ్చుతుంది. భారీ డైలాగుల జోలికి వెళ్లకుండా కథకూ, సన్నివేశానికీ ఎంత కావాలో అంతా రాసుకున్నాడు. అమ్మాయిల సైకాలజీ గురించి ఓ అమ్మాయే చెబితే వినడానికి బాగుంటాయి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ క్లాప్స్ కొడతారు. తొలి ప్రేమలో అది కనిపించింది. రాశీఖన్నా తో చెప్పించిన కొన్ని డైలాగులు అలాంటివే. అలా చాలా చోట్ల దర్శకత్వ ప్రతిభ కంటే కలం బలం ఎక్కువగా కనిపించింది. పతాక సన్నివేశాలు రొటీన్‌గానే కనిపిస్తాయి. అవన్నీ ప్రేక్షకుడు ఊహించినట్టుగానే ఉంటాయి. కాకపోతే.. ప్రేమకథలకు అలాంటి ముగింపే ఇవ్వాలి. అప్పుడే ప్రేక్షకుడి ఈగో సంతృప్తి పడుతుంది.
నటీనటుల ప్రతిభ
వరుణ్ తేజ్ సినిమా సినిమాకీ ఎదుగుతున్నాడు. ఆరడుగులు ఉన్నా కదా అన్న ధీమాతో యాక్షన్ స్టోరీల జోలికి వెళ్లకుండా తనకు నచ్చే కథల్ని ఎంచుకుని ప్రయాణం సాగిస్తున్నాడు. నటుడిగా తనకు మంచి మార్కులు పడతాయి. దానికంటే రాశీఖన్నాకు నాలుగు మార్కులు ఎక్కువ వేసినా తప్పులేదు. తన కెరీర్లో వర్ష.. ది బెస్ట్ అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. గ్లామర్‌గా కనిపించడం కంటే, అందంగా కనిపించడంపైనే దృష్టి పెట్టింది. కళ్లజోడులోనూ.. బుద్దిగా మెరిసింది. వీరిద్దరి కెమెస్ట్రీనే సినిమాకి సగం బలం. రాశీ స్థానంలో ఎవరున్నా… ఈ పాత్ర తేలిపోదునేమో. సినిమా అంతా.. వరుణ్, రాశీలే కనిపిస్తారు. మిగిలిన పాత్రలన్నీ సైడ్‌కి వెళ్లిపోయాయి. సుహాసిని కాసేపే మెరిసింది. నరేష్ కూడా అంతే. హైపర్ ఆది. ప్రియదర్శి ఓకే అనిపిస్తారంతే.
సాంకేతికంగా
తమన్‌కి మూడ్ బాగుంటే.. పాటలు ఎలా వస్తాయో తొలి ప్రేమ చూస్తే తెలుస్తుంది. మెలోడీ పరంగా తమన్‌కి ఫుల్ మార్కులు పడిపోతాయి. పదాల్లో పాటలు వినిపిస్తున్నాయి. నేపథ్య సంగీతం హాయిగా ఉంది. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రిచ్‌లుక్ కనిపించింది. దర్శకుడిలో మంచి రచయిత ఉన్నాడు. ఇంత రొటీన్ స్టోరీని అందరికీ నచ్చేలా తీయడం వెనుక.. మాటల రచయిత అందించిన సహకారం అంతా ఇంతా కాదు. చాలా సన్నివేశాల్ని డైలాగులతో ఎలివేట్ చేశాడు. అన్ని డిపార్ట్మెంట్లూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశాయి.
తీర్పు
ఇదో మామూలు ప్రేమకథ. కానీ హీరో, హీరోయిన్ల కెమెస్ట్రీ, వాళ్ల నటన, సహజమైన వినోదం… ఇవన్నీ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. మన ప్రేమకథ మనకు గుర్తు చేయడానికి వచ్చిన కొన్ని మంచి ప్రేమకథల్లో `తొలి ప్రేమ` ఒకటి. ఈ సినిమాలో ప్రేమ, కోపం, ద్వేషం, ఈగో అన్నీ ఉంటాయి. కానీ థియేటర్ నుంచి బయటకు వస్తుంటే మనకు మాత్రం `ప్రేమే` గుర్తుంటుంది. ‘తొలిప్రేమ’ మ్యాజిక్ అది.
ఫినిషింగ్ టచ్: ‘తొలిప్రేమ’కు తీసిపోదు
తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5