మాజీ సీఎం కేసీఆర్ ను ఆ ఎమ్మెల్యేలు ఎందుకు కలిసినట్లు…? ఫాంహౌజ్ లో పెద్దగా ఎవరినీ కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్… ఆ నలుగురిని ఎందుకు కలిసినట్లు? ఫాంహౌజ్ లో ఎవరు కలిసినా బయటకు రాని ఫోటోలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి?
గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీలో, నాయకుల్లో ఇదే చర్చ. పార్టీ ఓటమి తర్వాత ఎమ్మెల్యేలు చేజారుతారన్న వార్తలొచ్చినా… ఎంపీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతో పాటు, ఏపీలో జగన్ గెలిస్తే ఆర్థిక అండదండలుంటాయని బీఆర్ఎస్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బలంగా విశ్వసించారు. కానీ పార్టీ పుట్టిన నాటి నుండి చూడని ఘోర పరాజయం ఒకవైపు, జగన్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకే మొగ్గుచూపుతున్నారు.
దాదాపు 25మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అయ్యారన్న వార్త బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ తో చర్చలు జరిపిన మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ మారుతారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే లాగే ప్రవర్తించే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని, అదే బాటలో ఎల్.బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఉన్నారన్న వార్తలొచ్చాయి. దీంతో కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడారని… కావాలనే బీఆర్ఎస్ ఫోటోలు బయటకు వదిలి, ఆ నలుగురు తమతోనే ఉన్నారన్న ఇండైరెక్ట్ మెసెజ్ పంపిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… ఫలితం లేదని, ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోకి క్యూ కట్టడం ఖాయమని, కాంగ్రెస్ లోకి వెళ్లలేని వారు బీజేపీ గూటికి చేరేలా ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.