విశాఖ వైసీపీ నుంచి ఒక్కొక్కరు జారుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఇప్పటికే జెల్లకొట్టారు. ఆయన జనసేనలో చేరనున్నారు. రెండు రోజుల్లో మంగళగిరిలో చేరిక కార్యక్రమం ఉండనుంది. ఆయనతో పాటు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు కూడా కండువా కప్పించుకోనున్నారు. విశాఖలో చాలా మంది వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు వస్తాయని భావిస్తున్న చోట్ల.. కర్చీఫ్ వేసుకుంటే.. మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పంచకర్ల గుడ్ బై చెప్పగా.. మరో ఇద్దరు , ముగ్గురు నేతలు అదే దారిలో ఉన్నారంటున్నారు.
విశాఖ వైసీపీలో పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. రాజధాని అని చెప్పినా ఎవరూ నమ్మకపోగా.. ప్రజలు భయపడుతున్నారు. బయటపడిన భూదందాల్లో తెర వెనుక.. తెర ముందు ఏం జరిగిందో విశాఖ ప్రజలకు అర్థం అయింది. అందుకే.. ఎందుకైనా మంచిదని అందరూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. జనసేనలో నేతల్ని చేర్పించే విషయంలో ఓ టీడీపీ నేత కీలకంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేనకు ఎక్కడెక్కడ టిక్కెట్లు రావొచ్చో అంచనా వేసి..అక్కడ వైసీపీ నుంచి బలమైన నేతల్ని జనసేనలోకి పంపుతున్నట్లుగా చెబుతున్నారు.
ఈ వలసలు విశాఖకే పరిమితం కావని.. ముందు ముందు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు కూడా విస్తరిస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికలసమయం దగ్గర పడే కొద్దీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం రాదన్న గట్టి నమ్మకంతో ఎందుకైనా మంచిదని ఇతర అవకాశాలు చూసుకుంటున్నారు. పరిస్థితి తేడా వస్తే.. వచ్చే ప్రభుత్వంలో తీవ్రమైన వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారు.