ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడిన కార్యకర్తలకు ధైర్యం చెప్పడం కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తొలి విడతగా.. ఆయన తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ టూర్ లో ఓటమి ప్రభావం… టీడీపీ అధినేతకు స్పష్టంగా కనిపించింది.కొంత మంది కీలక నేతలు… సమావేశానికి హాజరు కాలేదు. ముఖ్యంగా.. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమావేశానికి హాజరు కాలేదు. టీడీపీ తరపున పోటీ చేసిన వరుపుల రాజా అనే నేత కొద్ది రోజుల కిందటే పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆయన కూడా రాలేదు. తోట త్రిమూర్తులు.. ఓటమి పాలైనప్పటి నుంచి పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట కాపు నేతలందర్నీ సమీకరించి ఆయన సమావేశం నిర్వహించడం కలకలం రేపింది.
అయితే..తాను టీడీపీలోనే ఉంటానని చెబుతున్నప్పటికీ… పార్టీ వ్యవహారాల్లో మాత్రం పాలు పంచుకోవడం లేదు. ఆయన అటు బీజేపీతోనూ.. ఇటు వైసీపీతోనూ చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. స్వయంగా టీడీపీ అధినేత జిల్లాకు వచ్చినప్పటికీ… ఆయనను కలిసేందుకు..సమీక్షా సమావేశానికి వచ్చేందుకు తోట త్రిమూర్తులు నిరాకరించారు. త్రిమూర్తులు వద్దకు రెడ్డి సుబ్రమణ్యంను చంద్రబాబు పంపారు. అయినప్పటికీ.. త్రిమూర్తులు వచ్చేందుకు నిరాకరించారు. తనకు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని.. కొంత మంది నేతలపై ఫిర్యాదు చేసి పంపించారు. యనమల, చినరాజప్ప తీరుపై త్రిమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనను ఇబ్బంది పెడుతున్నారని.. పార్టీకి నష్టం చేస్తున్నారని.. రెడ్డి సుబ్రమణ్యంతో చెప్పి పంపించారు తోట త్రిమూర్తులు. అయితే త్రిమూర్తులపై గతంలో ఉన్న కేసులు… ఇతర వ్యాపార వ్యవహారాల కారణంగా.. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని.. అందుకే… టీడీపీకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. రాజమండ్రి లోక్ సభ నుంచి పోటీ చేసిన మాగంటి రూప, కాకినాడ లోక్ సభకు పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కూడా… సమావేశాలకు రాలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు.. ఓటమి భారం… టీడీపీ సమావేశంలో స్పష్టంగా కనిపించింది.