ఆమధ్య ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరాలని నిర్ణయించుకున్న తర్వాత సడన్గా రామచంద్రపురంలోని తోట త్రిమూర్తులు ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు. చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఆమంచి కృష్ణమోహన్ రామచంద్రపురం వెళ్లి మరీ తోట త్రిమూర్తులు ని కలవడం లోని ఆంతర్యం ఏమిటనేది జనాలకు అంతుబట్టలేదు. అలాగే తోట త్రిమూర్తులు కూడా ఆమంచి బాటలో నడిచి తెలుగుదేశం పార్టీని వీడుతారని రూమర్లు కూడా మొదలయ్యాయి. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి న తోట త్రిమూర్తులు ఈ రెండు అంశాలపై స్పందించారు.
ఆమంచి కృష్ణమోహన్ తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని రాజకీయాల్లో కూడా ఇద్దరూ కలిసి ఒక సంఘటిత నిర్ణయం తీసుకుందామని ముందుగా అనుకున్నామని అయితే కృష్ణమోహన్ మాత్రం తన నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా, తన వ్యక్తిగత పరిస్థితుల దృష్ట్యా తన సొంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అందుకే వ్యక్తిగతంగా కలిసి తను సొంత నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పడానికి తన దగ్గరకు వచ్చి కలిశాడని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
అలాగే ఇక తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఊహాగానాల విషయమై తోట త్రిమూర్తులు స్పందించారు . అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు ఉన్నాయని చెప్పిన తోట త్రిమూర్తులు ఇది రాజకీయాల్లో అత్యంత సహజమే అని, ప్రజాభిమానం ఉన్న నాయకులు అందరికీ ఇలా అన్ని పార్టీల నుండి ఆహ్వానాలు వస్తూనే ఉంటాయని అన్నారు. అయితే పార్టీ మారుతాడా లేదా అన్న విషయం మాత్రం త్రిమూర్తులు స్పష్టత ఇవ్వలేదు.