తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. అనుచరులతో జరిగిన సమావేశంలో చంద్రబాబుపై త్రిమూర్తలు తీవ్ర విమర్శలే చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను అడిగిన పనులకు జీవోలు ఇచ్చి, అమలు చేయలేదని అందుకే మనస్తాపం చెందానని చెప్పుకొచ్చారు. నియోజకవర్గానికి అన్యాయం జరిగితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎందుకు బరిలో దిగారని ఇతరులు ప్రశ్నిస్తున్నారు కానీ… నిజానికి తోట త్రిమూర్తులు ఎన్నికలకు ముందే పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేశారు. జనసేన, వైసీపీ ఆఫర్లు ఇచ్చినా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు.
గతంలో ప్రజారాజ్యం వచ్చినపుడు ఇలానే టీడీపీని వీడి ఓడిపోయారు. అందుకే ఎన్నికలకు ముందు జనసేనలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. అదే సమయంలో వైసీపీ నెగ్గుతుందో ,…లేదో అనే మీమాంస కూడా ఆయనను వేధించింది. కానీ ఫలితాలు తారుమారు కావడంతో ఎన్నికలు ముగినప్పటి నుంచీ ముభావంగానే ఉంటున్నారు. కాకినాడలో రెండు రోజులపాటు జిల్లా పరిస్థితిపై చంద్రబాబు రివ్యూ చేసినా హాజరుకాలేదు. చినరాజప్ప, యనమలతో సత్సంబంధాలు లేకపోవడం… తన మనుషులపై చినరాజప్ప పలు కేసులు, రౌడీ షీట్లు తెరిపించారనే ఆగ్రహంతో త్రిమూర్తులు ఉన్నారు. అన్నిటికంటే మించి శిరోముండన కేసు కూడా త్రిమూర్తులును వెంటాడుతోంది.
ప్రస్తుతం తనకున్న కొన్ని ప్రత్యేక అవసరాలకు తోడు అనుచరులను నిలబెట్టుకోవాలంటే వైసీపీలోకి వెళ్ళడమే మంచిదని త్రిమూర్తులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీలో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు, త్రిమూర్తులుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సుభాష్‌చంద్రబోస్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదే సమయంలో త్రిమూర్తులుపై రామచంద్రపురంలో నెగ్గిన చెల్లుబోయిన వేణు ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ మారితే కేసుల నుంచి రక్షణ పొంద వచ్చు కానీ రాజకీయ భవిష్యత్ మాత్రం పణంగా పెట్టాల్సిందేనన్న అభిప్రాయం అనుచరుల్లో ఏర్పడింది.