ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల క్రితం వరకు రాష్ట్రం మొత్తం మీద వెయ్యి కేసులు నమోదయితే భారీగా నమోదయ్యాయని ఆందోళన చెందేవారు. ఇప్పుడు.. వెయ్యి కేసులు ఒక్కో జిల్లాలోనే నమోదవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద నమోదయిన కేసుల సంఖ్య 7,998. అన్ని జిల్లాల్లోనూ.. సరికొత్త రికార్డుల దిశగా కేసులు నమోదవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 58వేల టెస్టులు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
మరణాల విషయంలోనూ… ప్రమాదకరంగా పరిస్థితి మారుతోంది. ప్రతీ రోజూ అరవై మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క రోజులో 61మంది చనిపోయారు. కరోనా కేసుల విషయంలో దేశంలో అత్యధిక శాతం..మహారాష్ట్ర, తమిళనాడులో నమోదవుతూ ఉన్నాయి. ఇప్పుడు.. ఆ రాష్ట్రాల పక్కన ఆంధ్రప్రదేశ్ చేరుతోంది. మెట్రో సిటీలు ఉన్న నగరాల్లో… సహజంగానే కేసులు ఎక్కువ నమోదవవుతూ ఉంటాయి. ఎలాంటి సిటీలు లేని.. పూర్తిగా పల్లె వాతావరణం ఉండే.. గోదావరి జిల్లాల్లో కేసులు… విజృంభిస్తూండటం… అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది.
ఏడెనిమిది వేల సంఖ్యలో నమోదవుతున్న కేసుల కారణంగా… అందరికీ వైద్యం చేయించడానికి కూడా ప్రభుత్వం చిక్కులు ఎదుర్కోంటోంది. సీరియస్‌గా ఉన్న వారిని కూడా ఆస్పత్రులకు తీసుకెళ్లలేకపోతోంది. అంబులెన్స్‌లు సరిపోవడం లేదు. పాజిటివ్ వచ్చిందని తేలిన తర్వాత… రోజుల తరబడి ఇంటి వద్దే ఉంచుతున్నారు. ఎప్పటికీ అంబులెన్స్ రావడం లేదు. దాంతో చాలా మంది సోషల్ మీడియాల్లో వీడియోలు పెడుతున్నారు. ఈ కేసుల నమోదు ఇంతే సాగితే.. ఏపీలో ప్రమాదక పరిస్థితులు ఏర్పడటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.