కాలిక్యులేటర్లో ఒకటి ప్లస్ ఒకటి అని లెక్క వేస్తే రెండు రావాలి. మూడు వచ్చిందంటే… తేడా ఉందనే అర్థం. అలాగే… ఈవీఎంలో… 500 ఓట్లు పోలయితే.. కచ్చితంగా 500 ఓట్లు మాత్రమే ఉండాలి. ఒక్కటి ఎక్కువైనా.. తక్కువైనా… అందులో లోపం ఉన్నట్లే. ఇలాంటి లోపాలు… మొన్నటి ఎన్నికల్లో 373 నియోజకవర్గాల్లో బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో… 373 చోట్ల.. పోలయిన ఓట్లకు.. కౌంటింగ్ జరిగిన ఓట్లకు తేడా ఉంది. ఇది ఎలా జరిగిందని ఈసీ అడిగితే.. ఆ వివరాలను వెబ్సైట్ నుంచి తీసేశారు కానీ… సమాధానం మాత్రం.. ఎవరికీ చెప్పడంలేదు.
పోలయిన ఓట్లకు.. ఎక్కువో.. తక్కువో..! ఈవీఎంలు ఎలా మార్చుకుంటాయి..?
సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎమ్‌ల పనితీరుపై జాతీయ మీడియా ఓ పరిశోధన జరిపింది. సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఎక్కడా సరితూగలేదు. దాదాపు 373 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఏక్కడా సరిపోలేదు. కొన్ని చోట్ల ఓట్లు ఎక్కువగా రాగా.. ఇంకొన్ని చోట్లు ఓట్లు తక్కువగా వచ్చాయి. ముందుగా మొదటి నాలుగు దశల్లో జరిగిన పోలింగ్ ఓట్ల శాతాలను తీసుకున్న జాతీయ మీడియా సంస్థ… వాటిని లెక్కించిన ఓట్లతో సరిపోల్చింది. అయితే ఇందులో ఏ ఒక్క నియోజకవర్గం కూడా మ్యాచ్ కాలేదు. తమిళనాడులోని కాంచీపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసీ అధికారిక లెక్కల ప్రకారం 12 లక్షల 14 వేల 086 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపులో 12 లక్షల 32 వేల 417 ఓట్లు వచ్చాయి. అంటే 18 వేల 331 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇవి ఎలా వచ్చాయి..?
హడావుడిగా డాటాను వెబ్సైట్ నుంచి తీసేసిన ఎన్నికల సంఘం..!
ఒకటి రెండు నియోజకవర్గాలకే పరిమితం కాలేదు. దాదాపు 373 నియోజకవర్గాల్లో అసలు లెక్కలు తేలలేదు. పోలైన ఓట్లకు, కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లకు అస్సలు సరితూగనే లేదు. సుమారు 220 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. కౌంటింగ్ ఓట్లు అత్యధికంగా వచ్చాయి..? అయితే ఇది ఎలా సాధ్యమో… ఈసీ మాత్రం వివరణ ఇవ్వడం లేదు. తేడాలు, అవకతవకలపై జాతీయ మీడియా సంస్థ ఎన్నికల సంఘం వివరణ కోరింది. కానీ ఈసీ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదంటోంది. పైగా… ఈసీ వెబ్సైట్లో ఉన్న పోలయిన ఓట్ల వివరాల్ని తీసేశారు. ఇది మరింత అనుమానాస్పదంగా మారింది. తర్వాత పూర్తి స్థాయి డేటా తమకు అందుబాటులో లేదని.. వివరణ అడిగిన మీడియాకు చెప్పుకొచ్చారు.
బ్యాలెట్‌తో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ ఘన విజయాలు..!
పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ శాతంపై అధికారులకు సమాచారం అందిస్తారు. కానీ ఇప్పటికీ ఈసీ లెక్కిస్తూనే ఉన్నామంటోంది. ఇంకా తుది లెక్కలు రావాల్సి ఉందంటోంది. తన హయంలో ఏనాడు ఇలా జరగలేదన్నారు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్. ఇది సీరియస్ విషయమేనని చెబుతున్నారు. కానీ ఈసీకి మాత్రం కాదు. కొసమెరుపేమిటంటే… కర్ణాటక లో లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్ చేసిన బీజేపీ.. అర్బన్ లోకల్బాడీస్కి జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటింగ్ జరిగినా.. ప్రజలు బీజేపీకి ఓటేయలేదు. బెంగళూరులోనూ… ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను బ్యాలెట్‌తో నిర్వహించారు. అందుకే ఈసీ పని తీరుపై అదే పనిగా.. ఆరోపణలు వస్తున్నాయి. అనుమానాలను నివృతి చేయాల్సిన అవసరం ఈసీపై ఉంది.