మూడు రాజధానులు కావాలంటూ తిరుపతిలో రాయలసీమ మేధావులు ఫోరం ఆధ్వర్యంలో సభ జరిగింది. అమరావతి రైతుల సభకు పోటీగా నిర్వహించిన ఈ సభలో మేధావులంతా అమరావతి రాజధానిని వ్యతిరేకించారు. మూడు రాజధానులు కావాలని నినదించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు పెడితే అభివృద్ధి జరుగుతుందని వాదించారు. రాయలసీమ అభివృద్దిని ఎవరూ పట్టించుకోవడం లేదని తీర్మానించారు. చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ ఇలా ముఖ్య నేతలంతా రాయలసీమ నుంచి వచ్చినా వారు రాయలసీమ ద్రోహులని తేల్చేశారు.
అయితే మేధావులు మాత్రం తమ వాదన గట్టిగా వినిపించారు కానీ.. సభకు జనాల్ని మాత్రం ఆకర్షించలేకపోయారు. వచ్చిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. వారంతా డ్వాక్రా మహిళలు. మీటింగ్ ఉందనిచెప్పి తీసుకొచ్చారని అందరూ మీడియాకు బహిరంగంగానే చెప్పారు. మరికొంత మంది విద్యార్థుల్ని తీసుకొచ్చారు. వైసీపీకి సన్నిహితంగా ఉండే కాలేజీల విద్యార్థుల్ని తరలించారు. వారిలోనూ చాలా మంది తమ రాజధాని అమరావతిగానే ఉంటుందని చెప్పారు. డ్వాక్రా మహిళలు కూడా ఎక్కువ మంది అదే చెప్పారు.
అమరావతి అయితేనే దగ్గరగా ఉంటుందన్నారు. అసలు మీటింగేమిటో తెలియకుండా చాలా మంది వచ్చారు. తెలిసిన తర్వాత వెళ్లిపోయారు. లోపలికి వచ్చిన వారు బయటకు వెళ్లకుండా గేట్లు మూసేసినా ఎవరూ ఆగలేదు. గేట్లు దూకి మరీ వెళ్లిపోయారు. సభకు హాజరైన మేధావుల్లో 90శాతం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. వారంతా మూడు రాజధానులు కావాలి.. అమరావతిలో మాత్రం వద్దని నినదించారు.. కానీ సామాన్యులకు మాత్రం ఎందుకు వద్దో అర్థం అయ్యేలా చెప్పలేకపోయారు.