జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా వార్ తెలిసిందే. తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో మూడు ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇదంతా టీడీపీ స్కెచ్ అనీ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా రాతలు మొదలుపెట్టారు. మీడియా అధిపతులు రవిప్రకాష్, వేమూరి రాధాకృష్ణలను ప్రధానంగా టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఓరకంగా చెప్పాలంటే కయ్యానికి కాలు దువ్వారు. ఆ మూడు ఛానెల్స్ తనపై స్పందించాలనే ఉద్దేశంతోనే, పనిగట్టుకుని మరీ ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. ట్విట్లర్లో దుమ్మెత్తి పోస్తున్నా… ఆ మూడు ఛానెల్స్ ఎందుకు స్పందించడం లేదు..? వారి చేతిలో పవర్ ఫుల్ మీడియా ఉన్నా కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నాయి..? రెచ్చగొట్టే వ్యాఖ్యలు పవన్ చేస్తున్నా ఎందుకు భరిస్తున్నాయి..? ఈ మౌనం వెనక ఏదైనా పరమార్థం ఉందా.. అంటే, ఉందనే విశ్లేషించుకోవచ్చు.
రవి ప్రకాష్, రాధాకృష్ణలను బయటకి లాగాలనే ఉద్దేశంతోనే పవన్ ఉన్నారు. వారు కూడా తనని బహిరంగంగా విమర్శించాలనే పవన్ ఆశిస్తున్నారు. కానీ, వారు స్పందించడమే లేదు. ఎందుకంటే, ఈ విషయంలో స్పందించకుండా ఉండటమే.. పవన్ కి ఇచ్చిన జవాబుగా వారు చూస్తున్నారు. తాము మౌనంగా ఉంటేనే తన అపరిపక్వతను పవన్ పదేపదే బయటపెట్టుకుంటారనేది వారి వ్యూహంలా కనిపిస్తోంది. ఇప్పటికే తన తిట్ల ట్వీట్లతో చాలామందికి చిరాకు తెప్పిస్తున్నారన్నది వాస్తవం. ఇన్నాళ్లూ మనం చూసిన పవనేనా…? పుస్తకాలు బాగా చదువుతూ, మాట్లాడితే చేగువేరా గురించో, మరొకరి గురించో మాట్లాడే పవనేనా..? ఈయనేంటీ… ఈ ట్వీట్లేంటీ అనే ఒక రకమైన నిరాసక్తత కొంతమందికి కలిగింది. ఆ మీడియా అధినేతలు ఆశించింది కూడా ఇదేనేమో! పవన్ కి అండగా ఉంటుందని భావిస్తున్న ఓ సామాజిక వర్గ యువతలో కూడా ఈ వ్యాఖ్యలకు పెద్దగా మద్దతు లభించడం లేదనే అభిప్రాయమే వినిపిస్తోంది.
కాబట్టి, ఇలాంటి సమయంలో ఈ మూడు మీడియాలూ పవన్ పై యుద్ధం మొదలుపెడితే… అది కాస్తా రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య వార్ గా మారిపోయే అవకాశాలున్నాయి. అటువైపు మళ్లించేందుకు దారి కాచుకుని కూర్చున్నవారూ ఉన్నారు. పవన్ ని అడ్డుపెట్టుకుని సామాజిక వర్గ విభజనకు భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోందనే కథనాలూ ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కయ్యానికి కాలు దువ్వుతున్నది కూడా వారి ఆటలో భాగమేనా అనే అనుమానాలూ ఉన్నాయి. కాబట్టి, అందుకే సదరు ఛానెళ్లు పవన్ విషయంలో మ్యూట్ బటన్ నొక్కేసి కూర్చున్నాయని అనిపిస్తోంది. అందుకే, పవన్ పై పోరాటానికి సిద్ధపడ్డ ఆంధ్రజ్యోతి కూడా, ఇప్పుడెందుకులే అని సరైన సమయంలో చూద్దాం అనే వైఖరి తీసుకున్నట్టు తెలుస్తోంది.