తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడో ఓవర్ ఫ్లో అయింది. ఇబ్బడిమబ్బడిగా వచ్చి పడిన చానళ్లు ఇప్పుడు మనుగడ కోసం… తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. టాప్ ఫైవ్‌లో ఉన్న చానళ్లు…తప్ప.. నిన్నామొన్న పురుడు పోసుకున్న చానళ్లు కూడా.. బండిని చాలా భారంగా నెట్టుకొస్తున్నాయి. ఎవరైనా కొంటారా.. కనీసం పెట్టుబడులు పెడతారా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల వేడి ముంచుకు రావడంతో.. ఒకటి రెండు చానళ్లకు మహర్దశ పట్టింది. మరికొన్ని చానళ్లకు ఇప్పుడు పవన్ కల్యాణ్ దేవుడిలా కనిపిస్తున్నాడు. ఆదుకుంటాడనే ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే కొంటారు.. లేకపోతే.. కనీసం పెట్టుబడులు అయినా పెడతారనేది ఆ చానళ్ల ఆశ.
పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట..తన సహజసిద్ధమైన ఆవేశంతో… మీడియాతో లొల్లి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయనకు మీడియాలో అంతకు ముందు స్థాయిలో కవరేజీ రావడం లేదు. మీడియాతో గొడవ పెట్టుకున్నప్పుడే పవన్ కల్యాణ్ తన సొంత చానల్ ప్రారంభించబోతున్నారని ప్రచారం జరిగింది. దానికి జే టీవీ అని పేరు పెట్టారని చెప్పుకున్నారు. కానీ తర్వాత 99 టీవీని కొనేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత జాబితాలోకి టెన్ టీవీ, విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఏపీ 24/7 కూడా పవన్ పెట్టుబడులు పెట్టే చానళ్ల జాబితాలో చేరాయి. రోజులు గడుస్తున్నాయి కానీ.. పవన్ కల్యాణ్ ఇంకా టీవీ చానల్‌పై నిర్ణయం తీసుకోలేదు.
కానీ పెట్టుబడులు పెడతారన్న ఆశో.. మరో కారణమో.. కానీ… ఈ మూడు చానళ్లకు ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రధాన వార్తా వనరు అయ్యారు. పవన్ కల్యాణ్ అడుగు బయటపెడితే.. అదే వార్త అవుతోంది. ప్రసంగిస్తే.. అసాంతం లైవ్ ఇచ్చేస్తున్నారు. పవన్ కల్యాణ్.. దుమ్ము రేపుతున్నాడని డిస్కషన్లు పెడుతున్నారు. ఓ చానల్ అయితే.. ఏకంగా …జనసేనకు మెజార్టీ సీట్లు కట్టబెడుతూ.. సర్వే చేసినంత పని చేసింది. పవన్ కల్యాణ్ ఏదో ఓ చానల్లో పెట్టుబడి పెడితే..ఆ చానల్ మాత్రమే బాకా ఊదుతుంది. కానీ పెట్టుబడుల పేరుతో ఊరిస్తూ ఉంటే.. మూడు చానళ్లు కావాల్సినంత స్పేస్ ఇస్తున్నాయి. ఇలాగే బాగుంటుంది కదా అని పవన్ కల్యాణ్ అనుకుంటే మాత్రం ఆయా చానళ్లకు ఇబ్బందే..!