హైదరాబాద్: విజయవాడలో కల్తీ మద్యం ఘటన ఇవాళ సంచలనం సృష్టించింది. కృష్ణలంక ప్రాంతంలోని హోటల్ ‘ఎమ్’లో ఉన్న స్వర్ణ బార్లో ఇవాళ ఉదయం చీప్ లిక్కర్ తాగి ఏడుగురు చనిపోయారు… మరో 15మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రులకు తరలించారు. ఈ బార్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణుకు వాటా ఉందని చెబుతున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచారణకు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు బార్ వద్దకు చేరుకుని శాంపిల్స్ సేకరించారు. ఇది కల్తీ మద్యం వలన జరిగిందా, మద్యంలో కలుపుకున్న నీటి వలన జరిగిందా అనే కోణాన్నికూడా పరిశీలిస్తున్నారు. బార్‌ను సీజ్ చేశారు. మరోవైపు బాధితుల బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘటనాస్థలానికి బయలుదేరారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనాస్థలానికి వెళ్ళి పరిశీలించారు. కల్తీ ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని చెప్పారు. ఘటనాస్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. బాధితులంతా కూలీలని తెలిసింది. వీరు తాగిన వెంటనే అస్వస్థతకు గురయ్యారు. కల్తీ తీవ్రంగా జరగటంవలనే రియాక్షన్ చాలా వేగంగా ఉందని అంటున్నారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన బాధితులలో కూడా చాలామంది పరిస్థితి సీరియస్‌గా ఉందని అంటున్నారు.