ఓవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ మధ్యన… సినిమా డీలా పడిపోయింది. నాలుగైదు వారాలుగా సరైన సినిమా బాక్సాఫీసు ముందుకు రాలేదు. ఈ స్థబ్దత మరో నెల కొనసాగే అవకాశం ఉంది. ఈవారం కూడా పెద్ద అలికిడేం లేదు. కాకపోతే ఈ శుక్రవారం 3 సినిమాలు రాబోతున్నాయి. అందులో కొంత క్రేజీ స్టఫ్ కనిపించే అవకాశం కనిపిస్తోంది.
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ ఈనెల 25న వస్తోంది. ‘ప్రతినిధి’ ఫ్రాంచైజీ కావడం, దానికి తోడు ఎన్నికల సీజన్లో రావడం వల్ల… ఈ సినిమాపై ఫోకస్ పడింది. ట్రైలర్, టీజర్ చూస్తుంటే ఏపీలోని పాలక పక్షం పై ఈ సినిమా ఓ విమర్శనాస్త్రంగా సంధించబోతున్నారన్న విషయం అర్థం అవుతోంది. నారా రోహిత్ రీ ఎంట్రీ సినిమా కావడం, టీవీ 5లో జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకొన్న మూర్తి తొలిసారి దర్శకత్వం వహించడం ఆకర్షించే అంశాలు. ఏపీలోని పొలిటికల్ వైబ్.. ఈ సినిమాకు ప్లస్ కావొచ్చు.
విశాల్ ‘రత్నం’ కూడా ఈవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హరి దర్శకత్వంలో రూపొందిన మాస్, కమర్షియల్, యాక్షన్ సినిమా ఇది. విశాల్‌కు యాక్షన్ కథలు బాగా కలిసొచ్చాయి. ‘భరణి’, ‘పూజా’ చిత్రాల తరవాత వీరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ నేపథ్యంలో ‘రత్నం’పై దృష్టి పెట్టే ఛాన్సుంది. ఆయుష్ శర్మ కథానాయకుడిగా నటించిన ‘రుస్లాన్’ కూడా ఈ వారమే వస్తోంది. జగపతి బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకొంటోంది.