‘ఆక్సిజన్’, ‘ఆరడుగుల బుల్లెట్’, ‘గౌతమ్ నంద’ ఇలా హ్యాట్రిక్ పరాజయాల్ని అందుకున్నాడు గోపీచంద్. తన కెరీర్ చాలా సంక్లిష్టంలో పడిపోయింది. హిట్టు కొడితేనే మనుగడ. అసలే కథల విషయంలో ఆచి తూచి వ్యవహరించే గోపీచంద్ ఈ ఫ్లాపుల వల్ల మరింత డిఫెన్స్‌లో పడిపోయాడు. చేతిలో అవకాశాలున్నా, కథలు వింటున్నా.. దేనికి ఓటేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం గోపీ చుట్టూముగ్గురు దర్శకులు తిరుగుతున్నారు. ముగ్గురి కథ ఓకే అయిపోయింది. అయితే దేన్ని ముందుగా పట్టాలెక్కించాలో తెలీక.. తికమకపడుతున్నాడు గోపీ.
‘గౌతమ్ నంద’ తీసిన సంపత్ నంది గోపీచంద్‌కి మరో కథ వినిపించాడు. రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఆల్రెడీ స్క్రిప్టు కూడా సిద్ధమైపోయింది. మరోవైపు శ్రీవాస్కూడా గోపీతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ కథకి ఇటీవలే గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తమిళ దర్శకుడు తిరు కూడా లైన్లో ఉన్నాడు. ఇటీవల తిరు – గోపీచంద్ మధ్య కథకు సంబంధించిన డిస్కర్షన్స్ జరిగాయి. ‘ఆక్సిజన్’ తరవాత తమిళ దర్శకులంటే భయపడుతున్న గోపీచంద్… తిరు కథకి ఫ్లాటైపోయాడట. కచ్చితంగా ఈసినిమా చేయాల్సిందే అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలా.. మూడు కథల్ని ఒకే చేసేసినా.. అందులో దేన్ని ముందు పట్టాలెక్కించాలో గోపీచంద్‌కి అర్థం కావడం లేదు. ప్రస్తుతం తనకో విజయం కావాలి. అందుకే సేఫ్ జోన్లో ఉన్న కథని ఎంచుకుని మొదలెట్టాలనుకుంటున్నాడట. మరి ఈ మూడు కథల్లో మినిమం గ్యారెంటీ కథ చెప్పిన దర్శకుడెవరో చూడాలి.