ముంబై హీరోయిన్ ను తప్పుడు కేసులతో వేధించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు, విజయవాడ కమిషనర్ గా పని చేసిన కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ జీవోలు జారీ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక మూడు రోజుల కిందటే ప్రభుత్వానికి చేరింది. చంద్రబాబు సంతకం చేయడంతో జీవోలు విడుదలయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేశారు.
కుక్కల విద్యాసాగర్ రావుతో కలిసి పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి జెత్వానీపై వేధింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా వేధించారు. దీని వెనుక కుట్ర బయటపడటంతో వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. హీరోయిన్ జెత్వానీ కూడా పోలీసులకు ఆధారాలు సమర్పించి వారిపై ఫిర్యాదులు చేశారు. అయితే కుక్కల విద్యాసాగర్ పై కేసు పెట్టిన పోలీసులు ఇంకా ఐపీఎస్ అధికారులపై ఎలాంటి కేసులు పెట్టలేదు. అయితే డీజీపీ నివేదిక ఆధారంగా వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి వీరు ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాలు అన్నీ అన్నీ కావు. వాటికి సంబంధించిన నేరాలు, ఘోరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. వీరితో పాటు మరో పదిహేను మంది ఐపీఎస్లు వెయిటింగ్ లో ఉన్నారు. వారిలో మరికొంత మంది చేసిన అరాచకాలపై పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.