తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన అనూహ్యంగా వేగం పెంచారు. గ్రేటర్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని గ్రౌండ్ క్లియర్ చేసుకోవడమే కాదు.. ఏదైనా సీట్లు తేడా పడితే.. మేయర్ సీటును దక్కించుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. శరవేగంగా క్యాబినెట్ భేటీలో ఆమోదం తీసుకున్నారు. శనివారమే ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు.
కొత్త ఎమ్మెల్సీలుగా ప్రజా కవి గోరెటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ లను కేసీఆర్ ఎంపిక చేశారు. గోరటి వెంకన్న.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తన పాటలతో ఆయన ప్రజలను చైతన్యవంతం చేశారు. నేరుగా ఆయన టీఆర్ఎస్లో చేరకపోయినప్పటికీ.. ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చే ఉద్దేశంతో కేసీఆర్ ఆయనకు చాన్సిచ్చారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య… టీఆర్ఎస్లో చేరినప్పటికీ.. పోటీ చేసే అవకాశం రాలేదు. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. పార్టీలో చాలా కాలం నుంచి పని చేస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ కు కేసీఆర్ అనూహ్యంగా అవకాశం కల్పించారు.
ఇంత హఠాత్తుగా ముగ్గురు ఎమ్మెల్సీల్ని ఖరారు చేయడం.. ప్రమాణస్వీకారం చేయడం వెనుక.. గ్రేటర్ ఎన్నికల వ్యూహం ఉంది. వీరు ముగ్గుర్ని గ్రేటర్ ఖాతాలో ఎక్స్ అఫీషియో ఓటర్లుగా చూపాలని కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి ఏమైనా ఓట్లు తక్కువ పడితే వీరి ఓట్లతో గట్టెక్కవచ్చన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. దీపావళి ముగిసిన తర్వాత రోజే… గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.