శ్రీరెడ్డిపై నాని న్యాయ పోరాటానికి దిగాడు. నిజానికి ఇదెవరూ ఊహించనిదే. బిగ్ బాస్ షోలో నాని బిజీ అయిపోతాని, శ్రీరెడ్డి కామెంట్లని ఎప్పటిలానే లైట్ తీసుకుంటారని అనుకున్నారు. కానీ సడన్గా నాని గేమ్ ప్లాన్ ఛేంజ్ చేశాడు. ఈ లీగల్ నోటీసుల వల్ల నాని ఏం సాధిస్తాడనేది పక్కన పెడితే – ప్రస్తుతానికి బంతిని తన కోర్టులోంచి శ్రీరెడ్డి కోర్టులోకి వేసేశాడు. అంత వరకూ ఈ లీగల్ నోటీసుల వల్ల ఉపయోగమే జరిగిందనుకోవాలి. మరిప్పుడు శ్రీరెడ్డి స్టెప్పేంటి? అనేదే ఆసక్తికంగా మారింది.
శ్రీరెడ్డి ముందు మూడు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి… ‘నేచురల్ స్టార్ నాని అంటే నువ్వుకాదు’ అంటూ డొంకతిరుగుడు సమాధానాలతో గట్టెక్కేయడం. రెండోది… ‘సారీ’ అంటూ తెల్ల జెండా ఊపడం. మూడోది… తన ఆరోపణల్ని మరింత తీవ్రతరం చేయడం, చేతిలో ఉన్న ఆధారాల్ని చూపించడం. శ్రీరెడ్డి చేతిలో ఆధారాలేం లేవన్నది సుస్పష్టం. ఉంటే ఈ పాటికే బయటపెట్టేసేది. శ్రీరెడ్డివి కేవలం ఆరోపణలు మాత్రమే. అందుకు బలాన్ని చేకూర్చే సాక్ష్యాలు లేవు. ఇది వరకు కూడా శేఖర్ కమ్ముల విషయంలో ఇలానే రెచ్చిపోయి చివరికి `సారీ` చెప్పింది. సేమ్ టూ సేమ్ నాని విషయంలోనూ ఇదే జరుగబోతోందేమో. సురేష్ బాబు తనయుడ్ని టార్గెట్ చేసి, ఫొటోలతో సహా దుమ్ము దులిపేసిన శ్రీరెడ్డి – ఆ తరవాత ఆ వ్యవహారాన్ని అక్కడితో వదిలేసింది. అంత బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడే శ్రీరెడ్డి ఏం చేయలేకపోయింది. ఇప్పుడు నాని విషయంలో సంచలనాలు సృష్టిస్తుందనుకోవడం అవివేకమే. సో.. నాని స్టెప్పుతో.. శ్రీరెడ్డి దూకుడుకి కాస్తయినా కళ్లెం పడుతుందేమో చూడాలి.