వైకాపా నుంచి గత నెల రోజుల వ్యవధిలో 8మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి జంప్ అయిపోయారు. త్వరలో మరో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి జంప్ అవబోతున్నారని తాజా సమాచారం. వైకాపాలో శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట), వారపుల సుబ్బారావు (ప్రత్తిపాడు) మరియు వి.రాజేశ్వరి (రంపచోడవరం) పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెదేపాలో చేరడంతో ఆయన నిర్వహిస్తున్న పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని ఆశించిన జ్యోతుల నెహ్రూ అది దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికిలోనయ్యారు. ఆ కారణంగానే ఆయన పార్టీ మారాలనుకొంటున్నట్లు తెలుస్తోంది. వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి తెదేపా కూడా ఇటీవల గట్టిగా ప్రయత్నిస్తోంది కనుక వారిని ఆహ్వానించడానికి దానికి ఎటువంటి అభ్యంతరమూ ఉండబోదు. పైగా జ్యోతుల నెహ్రూ ఒకప్పుడు తెదేపాలో చేసిన వారే. కనుక వారు ముగ్గురూ ఏప్రిల్ 1 లేదా 2వ తేదీలలో తెదేపాలో చేరేందుకు ముహూర్తం పెట్టుకొన్నట్లు తాజా సమాచారం. ఒకవేళ అదే జరిగితే వైకాపాకి ఇది మరో ఎదురు దెబ్బే అవుతుంది. ఇటీవల నెల్లూరులో జరిగిన ఒక సభలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “నేను ప్రజలను, పైనున్న ఆ దేవుడినే నమ్ముకొన్నాను తప్ప (పార్టీలో) నాయకులని కాదు,” అని చెప్పడం తను పార్టీలో నేతలపై ఎన్నడూ ఆధారపడను కనుక వారు పార్టీలో ఉన్నా పోయినా పట్టించుకోనని చెప్పినట్లుంది. ఒక బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి తమ గురించి ఆవిధంగా చులకనగా మాట్లాడటాన్ని పార్టీలో నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకి వెళ్ళిపోయినట్లయితే, దానికి అది కూడా ఒక కారణమేనని భావించవచ్చును.