వైకాపా ఎమ్మెల్యేల వలసలు నిలిచిపోయాయని అందరూ భావిస్తుంటే త్వరలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తాజా సమాచారం. ఈ సంగతి తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు స్వయంగా తెలిపారు. ముగ్గురూ కూడా జిల్లాకి చెందినవారేనని తెలిపారు. ప్రస్తుతం వారితో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అవి దేనికో అందరికీ తెలుసు. ఒకవేళ అవి సఫలం అయితే వారు ముగ్గురూ గోడ దూకేయవచ్చు. కధ చర్చల వరకు వచ్చిందంటే క్లైమాక్స్ చేరుకొన్నట్లుగానే భావించవచ్చు.
వారి ముగ్గురిలో నూజివీడు ఎమ్మెల్యే అప్పారావు ఒకరని అర్జునుడు చెప్పారు. అప్పారావు పార్టీ మారుతారంటూ దాదాపు ఆరు నెలలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆయన ఖండిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఖండిస్తారో లేదో చూడాలి. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా, పదేపదే ఆయన గురించి ఇటువంటి వార్తలు వస్తుండటం నిజమైన అయ్యుండాలి లేదా తెదేపా నేతలు ఆయనతో మైండ్ గేమ్ ఆడుతున్నా ఉండవచ్చు. ముగ్గురిలో ఒక్క అప్పారావు పేరు మాత్రమే బయటపెట్టడం గమనిస్తే ఇది మైండ్ గేమ్ అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ కాకుంటే, ఇది వైకాపాకి మరో ఎదురుదెబ్బే అవుతుంది. బహుశః త్వరలోనే ఇది నిజమో కాదో తేలిపోవచ్చు.
వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం లేదని తెలిసున్నప్పుడు, తెదేపాలో వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వలన తెదేపాకే సమస్యలు ఎదురవవచ్చు. ఒకవేళ తెదేపాలో చేరుతున్న వైకాపా ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికలలో తెదేపా టికెట్లు కేటాయించనట్లయితే, వారు మళ్ళీ వైకాపాకి తిరుగు ప్రయాణం కావచ్చు. అదే జరిగితే తెదేపాకి డని వలన కూడా నష్టం జరుగుతుంది.
ఆ ఎమ్మెల్యేలు ఖాళీ చేసిన స్థానాలని వైకాపా వేరొకరికి కేటాయించడం తధ్యం కనుక, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎన్నికలకి ముంది మళ్ళీ వైకాపాలోకి వెళ్ళాలనుకొన్నా ప్రయోజనం ఉండక పోవచ్చు. అప్పుడు వారి పని వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లవుతుంది.
ఈ ఫిరాయింపుల వలన తాత్కాలికంగా వైకాపా నష్టపోవచ్చు. కానీ దానిని పూర్తిగా అడ్డు తొలగించుకోవడం తెదేపా వల్ల కాదు. అలాగే మారుతున్న ఎమ్మెల్యేలకి తాత్కాలికంగా ప్రయోజనం కలుగవచ్చు కానీ భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ప్రభుత్వం, వైకాపా ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా దూరదృష్టితో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.