సాక్షితో సహా ఇతర మీడియా సంస్థలేవీ చేయలేని పనిని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అద్భుతంగా చేశాడు. అఫ్కోర్స్ చంద్రబాబు తప్ప ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలు, ఉద్యోగులు, మంత్రులు, మంత్రుల పిల్లలు…మరీ ముఖ్యంగా జగన్‌తో సహా ప్రతిపక్ష నాయకులందరూ కూడా అసమర్థులు, తప్పులు చేసేవాళ్ళే అన్న ఆర్కే మార్క్ బాష్యం పక్కన పెడితే చంద్రబాబు పాలనలో ఉన్న లోపాలను మాత్రం సవివరంగా ఆవిష్కరించాడు రాధాకృష్ణ.
చంద్రబాబు పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి ఢిల్లీ వరకూ తెలిసిపోయింది. మంత్రులూ, శాసనసభ్యులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. కొంతమంది మంత్రుల కుమారులు సిండికేట్‌గా ఏర్పడి స్వైర విహారం చేస్తున్నారు. అవినీతి వ్యవహారాల్లోకి లోకేష్ పేరును కూడా లాగుతున్నారు. అర్జెంట్‌గా అలాంటి వ్యవహారాలను అడ్డుకోకపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అధికార పార్టీకి చెందినవారితో పాటు అధికారులు, ఉద్యోగులు కూడా విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఎన్నికలకు ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో చంద్రబాబు కొన్ని అలవికాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అడ్డం-పొడవు ప్రకటనలు చేశారు. ఆర్భాటపు ప్రకటనలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రజలకు ఎన్నో ఊహలు, ఆశలు కల్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడేళ్ళయినా కూడా ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది. నీడి కావాలనుకుంటే ఒక చెట్టు కూడా కనిపించని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించారు. అది చూసిన వారు ఎవ్వరికైనా అసలు రాజధాని నిర్మాణం ఎప్పటికి జరగాలి అన్న సందేహం తలెత్తక మానదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్ళయింది. ఇక మిగిలింది రెండేళ్ళే. అందులో ఒక ఏడాది పూర్తిగా ఎన్నికల సంవత్సరం. అంటే చంద్రబాబుకు తనను తాను నిరూపించుకోవడానికి ఉన్నది ఒక్క సంవత్సరం మాత్రమే. ఆ ఒక్క సంవత్సరంలో ఏదైనా అద్భుతాలు జరగకపోతే మాత్రం మొదటికే మోసం రావొచ్చు.
ఇదీ చంద్రబాబు మూడేళ్ళ పాలన గురించి రాధాకృష్ణ ఆవిష్కరించిన చిత్రం. అన్నీ నిజాలే. అయితే రాధాకృష్ణ చెప్పని నిజాలు, అబద్ధాలతో కవర్ చేసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. మూడేళ్ళుగా ఇలాంటి పాలన అందించిన చంద్రబాబు సమర్థత గురించి అదే వ్యాసంలో చాలా సార్లు ప్రశంశించాడు ఆర్కె. చంద్రబాబుని మాత్రం అవినీతి అంటని పునీతుడిని చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కులం కోసం కొట్టుకుంటున్నారు అనే స్థాయిలో చెప్పుకొచ్చాడు. అయితే ఆ కుల గొడవలను రెచ్చగొడుతోంది ఎవరు? పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చాం…మరో పదేళ్ళు మనమే అధికారంలో ఉండాలి అని చెప్పి సొంత కుల సభకు వెళ్ళిన ఒక అధికార పార్టీ నాయకుడు వ్యాఖ్యానించాడు. పార్టీలకు అతీతంగా ఉంటూ అందరు సభ్యులను కంట్రోల్ చేయాల్సిన అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి ఆయన. అత్యున్నత పదవుల్లో ఉన్నవారే అలా ఉంటే ఇక సామాన్యులు ఎలా ఉంటారు? ఏది ఏమైనా వ్యక్తిగతంగా చంద్రబాబు గురించి చెప్పిన విషయాలను పక్కన పెడితే చంద్రబాబు మూడేళ్ళ పాలన గురించి, అధికార పార్టీ నాయకుల ఆగడాల గురించి మాత్రం జగన్ మీడియాతో సహా ఎవ్వరూ చేయలేని స్థాయిలో అద్భుతంగా ఆవిష్కరించాడు ఆర్కె. ఆ విషయంలో మాత్రం రాధాకృష్ణను మెచ్చుకోవాల్సిందే.