ఖమ్మంలో ఓ బలమైన నేత కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ., .. తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరుపుతోంది. ఆయనకు పాలేరు టిక్కెట్ ఆఫర్ చేసి.. పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. పాలేరు నుంచి గత ఎన్నికల్లో తుమ్మల పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి .. బీఆర్ఎస్ లో చేరడంతో ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. తుమ్మల పార్టీ మారుతారని చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యక్ష రాజకీయాల్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని మాత్రం చెబుతూ వస్తున్నారు.
ఈ సారి కేకే రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం లేదని.. దాన్ని తుమ్మలకు ఇస్తామన్న లీకుల్ని కేసీఆర్ ఆయన వద్దకు చేరేలా చేశారు. అయితే కేసీఆర్ ను నమ్ముకున్న మండవ వంటి వారి పరిస్థితి ఏమయిందో తెలుసు కదా అని అయన అనుచరులు .. వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే పోటీ చేయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ లో పొంగులేటి చేరారు. బీజేపీకి బలమైన నేత లేరు. ఈ నెల 27న అమిత్ షా బహిరంగసభ ఖమ్మంలో ఉంది. ఆ సభలో తుమ్మలను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
తుమ్మల పార్టీ మారుతారా లేదా అన్న సంకేతాలు లేవు. ఆయన… బీఆర్ఎస్ పెద్దలతో సన్నిహితంగానే ఉన్నారు. కానీ తనపై ఓడిపోయిన వ్యక్తిని తెచ్చుకుని.. టిక్కెట్ ఇవ్వడం తనను ఏ మాత్రం గౌరవించడం కాదని ఆయన అనుకుంటున్నారు. అందుకే పార్టీ ని వీడిపోవడానికి ప్రత్యేకమైన భావోద్వేగం ఏమీ ఉండదని… చెబుతున్నారు. బీజేపీ పార్టీలో నేతల్ని చేర్చుకునే విధానం వేరుగా ఉంటుంది. వారు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే తుమ్మల బీజేపీ లో చేరిపోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.