ఖమ్మం జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితులు .. టీఆర్ఎస్ అగ్రనేతలకు కునుకు పట్టనీయడం లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా బాధ్యతలు తీసుకున్న తుమ్మల నాగేశ్వరరావు.. మొదటి నుంచి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట్లో.. సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవకపోతే… తాను మంత్రివర్గంలో ఉండనంటూ.. కాస్త గద్గత స్వరంతో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆ తర్వాత.. నిన్న… టీడీపీకి రాజీనామా చేసేందుకు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. మీరు రాజకీయాలు వద్దంటే.. వ్యవసాయం చేసుకుంటానని కార్యకర్తల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ ముందు.. టీడీపీకి రాజీనామా చేసినందుకు.. తుమ్మల అంతగా ఎందుకు బాధపడిపోతున్నారో.. అక్కడెవరికీ అర్థం కాలేదు. కానీ… ఖమ్మంలో పరిస్థితులు చేజారిపోతూండటంతో… ప్రజల్లో టీడీపీపై ఉన్నఅభిమానం ఒక్కసారిగా బయటపడుతూండటంతో.. తుమ్మల టెన్షన్ కు గురవుతున్నారన్న భావన మాత్రం వ్యక్తమవుతోంది. మామూలుగా… ఖమ్మం జిల్లాలో కాంగ్రెసె, టీడీపీ ఆ తర్వాత కమ్యూనిస్టులు పార్టీలు బలంగా ఉంటాయి. ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకులు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ కు మాత్రం.. ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ లేదు. ఆ పార్టీ తెలంగాణ వాదన్ని బలంగా వినిపించి.. దాన్ని మనసులోకి ఎక్కించుకున్న వారే ఓటు బ్యాంకులు. ఖమ్మంలో అలాంటి వారు చాలా తక్కువ. వైసీపీ ఎమ్మెల్యేల్ని చేర్చుకుని… తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చి.. దాదాపుగా టీడీపీ క్యాడర్ ను మొత్తం లాగేసినా… టీఆర్ఎస్ బలపడిందని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. నామా నాగేశ్వరరావు ఖమ్మం లో చేసిన ప్రదర్శన.. రాహుల్, చంద్రబాబు పర్యటన తర్వాత మారిన సమీకరణాలో… తుమ్మల.. ఎమోషనల్ బ్లాక్ మెయిలంగ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. చంద్రబాబు టూర్ కి వచ్చే ముందు… కేసీఆర్ స్టైల్లో… చంద్రబాబు.. క్షమాపణ చెప్పి ఖమ్మంలో అడుగు పెట్టాలనే వ్యాఖ్యలు చేశారు. ఇవి మిస్ ఫైర్ అయ్యాయనే భావన ఉంది. మంత్రి పదవి కోసం టీఆర్ఎస్ లో చేరినా… చంద్రబాబు గురించి అలా మాట్లాడటం సరికాదన్న భావన… ఆయన అనుచరవర్గంలోనే వ్యక్తమయినట్లు తెలుస్తోంది. దీంతో.. తనకు టీడీపీపై ఎంతో అభిమానం ఉందని.. ఆ పార్టీ వీడినందుకు.. చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. అయితే మంత్రి పదవి కోసమే వెళ్లానని చెబితే… బాగుండదనుకున్నారేమో కానీ.. సీతారామప్రాజెక్టు కోసం వెళ్లానని.. ఆ ప్రాజెక్ట్ కోసమే.. టీఆర్ఎస్ లో ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఎంత చేసినా.. టీడీపీ సంప్రదాయ ఓట్లు.. టీఆర్ఎస్ కు పడటం కష్టమేనన్న భావన మాత్రం ఖమ్మంలో ఉంది.