కేసీఆర్ డైలాగ్‌ను రిపీట్ చేసి తుమ్మల నాగేశ్వరరావు ఆయన పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయిపోయారు. పాలేరు నుంచి టిక్కెట్ ఇస్తారని ఎదురు చూసిన ఆయనకు కేసీఆర్ షాకిచ్చారు . దీంతో భారీ బలప్రదర్శన చేసిన ఆయన.. తల నరుక్కుంటాను కానీ తల వంచనని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నిలబడి తీరుతానని ప్రకటించారు. ఎన్నికల నుంచి తప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తన రాజకీయ జీవితం తనకు ఎవరిపై కోపం లేదని.. ప్రజల కోసం పోటీలో ఉంటానని ప్రకటించారు. ఏ పార్టీ అన్నది ప్రకటించలేదు.
ప్రజాసేవ కోసమే రాజకీయాలు అవసరమని.. తన జీవితాన్ని ఖమ్మం అభివృద్ధి కోసమే ధారబోశానన్నారు. తనకు పదవి అలంకారం మాత్రమేనని.. అహంకారం కాదన్నారు. మీ కోసం కష్టపడతాను.. మీతో శభాష్ అనిపించుకుంటానని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ ఖాయమని తేలడంతో… తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు కూడా ఖాయమని అనుకోవచ్చు. పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డికి కేసీఆర్ టిక్కెట్ ప్రకటించారు. తుమ్మల పార్టీ మారకుండా నామా నాగేశ్వరరావు ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ తనను అవమానించారని తుమ్మల మండిపడినట్లుగా తెలుస్తోంది. మీ ప్రేమ చూశాక మళ్లీ ఎమ్మెల్యేగా అడుగుపెడతానని నమ్మకం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ నిందించబోనని.. ఆత్మ గౌరవం కోసం ఎన్నికల్లో నిలబడతానన్నారు.
తుమ్మలను పార్టీలో చేర్చుకుని అడిగిన సీటు ఇవ్వడానికి బీజేపీ, కాంగ్రెస్ రెండూ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనతో రెండు పార్టీలూ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. తుమ్మల ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరం. ఆయన మళ్లీ టీడీపీలో చేరిన ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.