హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజులో పిడుగుపాటు ఘటనలకు 20మంది చనిపోయారు. ముందెన్నడూ లేనివిధంగా ఏపీలో ఒకేరోజు పిడుగులకు ఇంతమంది చనిపోవటం సంచలనం సృష్టించింది. నెల్లూరుజిల్లాలో అత్యధికంగా ఆరుగురు, ప్రకాశం, కృష్ణాజిల్లాలలో నలుగురు చొప్పున పిడుగుపాటు ఘటనలలో మరణించారు. పొలాలలో పనులు చేసుకుంటున్నవారే ఎక్కువగా ఈ పిడుగుపాటు ఘటనలలో చనిపోయారు. రాష్ట్రప్రభుత్వం రు.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణికారణంగా కురుస్తున్న ఈ వర్షాలు ఖరీఫ్ పంటలకు వరదాయకంగా మారటంతో రైతులు ఆనందపడుతున్నప్పటికీ సామాన్య ప్రజలుమాత్రం సతమతమవుతున్నారు. ఈ పిడుగుపాటు ఘటనలు ఇవాళకూడా కొనసాగొచ్చని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు గుంటూరుజిల్లా పేరేచర్లలో క్రికెట్ స్టేడియమ్ గ్రౌండ్లో ఉన్న ఒక తాటిచెట్టుపై పిడుగుపడటంతో చెట్టు మొవ్వలో నిప్పు రాజుకుని మంటలు రేగాయి. ఆ సమయంలో ఆ స్టేడియమ్లో అంతర్ రాష్ట్ర వుమన్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. గ్రౌండ్లో ఉన్న ఆంధ్ర, త్రిపుర రాష్ట్రాల క్రికెట్ టీమ్‌లు ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్నాయి. నిర్వాహకులు వెంటనే టీమ్‌ల సభ్యులను గ్రౌండ్ నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయారు.
ప్రకృతి వైపరీత్యాలలో ఎక్కువమంది చనిపోయేది పిడుగుల వలనేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది.గత 45 సంవత్సరాలలో పిడుగులవలన 80వేలమంది చనిపోయారని తెలిపింది. పిడుగుల శబ్దం వినపడగానే ఏదైనా కాంక్రీట్ భవనంలోకి వెళ్ళి తలదాచుకోవాలని, 30-45 నిమిషాలదాగా బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పిడుగులు గ్రామీణప్రాంతాలలో మాత్రమే పడతాయనుకోవటం అపోహ అని, క్యుములోనింబస్ మేఘాలు ఆవరిస్తే పట్టణ ప్రాంతాలలోకూడా పడొచ్చని చెబుతున్నారు. చెట్లకిందగానీ, స్తంభాలకిందగానీ నిలుచోకూడదని సూచిస్తున్నారు.