Thundu movie review
ఈమధ్య మలయాళ చిత్రాలకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వచ్చాక… ఆ భాషలో సినిమాల్ని సబ్ టైటిల్స్ తో చూసే బాధ తప్పాక, తెలుగు డబ్బింగులు పెరిగాక ఆ ప్రేమ మరింత ఎక్కువయ్యింది. స్టార్లు లేకపోయినా, భారీ బిల్డప్పులు ఇవ్వకపోయినా కంటెంట్ తో మెస్మరైజ్ చేస్తున్నారు అక్కడి మేకర్స్. అందుకే మలయాళ డబ్బింగులకు గిరాకీ పెరిగింది. నటీనటులెవరో తెలియకపోయినా, దర్శకుడి పేరుతో పెద్దగా పరిచయం లేకపోయినా ఓ లుక్కేయడం ఆనవాయితీగా మారింది. దాంతో మలయాళంలో వచ్చిన ప్రతీ సినిమా… డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ జాబితాలో చేరిన మరో సినిమా `తుండు`. `అయ్యప్పకోషియమ్` లాంటి క్లాసిక్ సినిమాతో పేరు తెచ్చుకొన్న బీజూ మీనన్ ఇందులో కథానాయకుడు. దాంతో ఆ ఫోకస్ మరింత ఎక్కువైంది. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా… ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. మరి `తుండు` ఎలా ఉంది? మలయాళ మేకర్స్ మరోసారి మాయ చేశారా?
బేబీ (బీజూ మీనన్) ఓ కానిస్టేబుల్. తనకో కొడుకు. ఇంటర్ చదువుతుంటాడు. కాలేజీలో కాపీ కొట్టి, దొరికిపోతాడు. మరోసారి ఇలా కాపీ కొడితే… కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని యాజమాన్యం హెచ్చరిస్తుంది. మరోవైపు.. బీబీకి తన స్టేషన్లో సమస్యలు ఎదురవుతుంటాయి. తనకంటే జూనియర్ అయిన… హెడ్ కానిస్టేబుల్ షిపిన్ (షైన్ టామ్ చాకో) తనపై ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. దాంతో డిపార్ట్మెంట్ టెస్టులు రాసి, ఏఎస్సై అవ్వాలని డిసైడ్ అవుతాడు. కానీ కొన్ని సబ్జెక్ట్స్ లో బేబీ వీక్. ఎలాగైనా సరే… పాస్ అయి, ఏఎస్సై అవ్వాలన్న కాంక్షతో… పరీక్షల్లో కాపీ కొట్టాలని డిసైడ్ అవుతాడు. మరి ఆ కాపీ ప్రహసనం సక్సెస్ గా సాగిందా? బేబీ ఏఎస్సై అయ్యాడా? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.
కాపీ కొడితే సుద్దులు చెప్పాల్సిన ఓ తండ్రి, అందులోనూ బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి కాపీ కొట్టాలనుకోవడం, అందుకోసం కొడుకు సహాయం తీసుకోవడం ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే. ఆ ఆలోచనకే సగం మార్కులు వేసేయొచ్చు. అయితే కేవలం ఆలోచన మాత్రమే సరిపోదు. దాని చుట్టూ మరో బలమైన ఎలిమెంట్ ఉండాలి. ఆ ఎలిమెంట్ దగ్గరే… దర్శకుడు ఆపపోపాలు పడ్డాడు. సాధారణంగా ఏ డిపార్ట్మెంట్లో అయినా పై స్థాయి ఉద్యోగుల ఆధిపత్య పోరు ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ లో కాస్త ఎక్కువ. దాన్ని ఈ కథలో చూపించే అవకాశం వచ్చింది. కానీ దర్శకుడు సరిగా వాడుకోలేదు. షిపిన్ ఏదో ఓ సందర్భంలో బేబీని ఇబ్బంది పెడతాడు. తన ఆధిపత్యం చూపించాలనుకొంటాడు. ఆ మాత్రం దానికే, 22 ఏళ్ల కెరీర్లో తొలిసారి డిపార్ట్మెంట్ టెస్ట్ రాయడానికి పూనుకొంటాడు కథానాయకుడు. ఆ ప్రహసనంలో కాపీ కొట్టడానికి బయల్దేరతాడు. ఆ కాపీ.. వ్యవహారం ఒక్క ఎపిసోడ్‌కే పరిమితం చేశాడు. నిజానికి ఈ ఎపిసోడ్‌తో వీలైనంత వినోదాన్ని, ఉత్కంఠతనీ మేళవించొచ్చు. ఆ దిశగా దర్శకుడు ఆలోచించలేకపోయాడు.
ద్వితీయార్థం.. ఇన్ హౌస్ (పోలీస్ డిపార్ట్మెంట్)లో ఇచ్చే పనిష్మెంట్లు ఎలా ఉంటాయి? ట్రైనింగ్ ఎలా సాగుతుంది? అనే దానిపైన వెళ్లిపోయింది కథనం. ఆయా వ్యవహారాలు తెలిసినవాళ్లకు ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండొచ్చేమో. మిగిలినవాళ్లకు అదంతా అనవసరం అనిపిస్తుంది. ఇక్కడే దర్శకుడు కథ విషయంలో పూర్తిగా గాడి తప్పినట్టు తెలిసిపోతుంది. తొలి సన్నివేశాల్లో ఈ సినిమాని విద్యా వ్యవస్థ చుట్టూ మళ్లించినట్టు అనిపిస్తుంది. ఆ తరవాత పోలీస్ డిపార్ట్ మెంట్ వైపు కథ మళ్లుతుంది. అక్కడి నుంచి కథ ఒక చోటే గింగిరాలు తిరుగుతుంటుంది. బేబీ తనయుడి ఎంట్రీ, అక్కడ ఇచ్చిన బిల్డప్ చూసి, ఇదో టీనేజ్ స్టోరీ అనుకొంటారంతా. కానీ ఆ తరవాత ఆ వాసనే ఉండదు. ఇంతకీ ఈ సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలనుకొన్నాడో అర్థం కాదు. చిన్న చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్లంతా డిపార్ట్మెంట్ టెస్టుల్లో కాపీ కొట్టయినా సరే, ఉన్నత స్థానానికి వెళ్లాలని చెప్పాడేమో అనిపిస్తుంది. అదే దర్శకుడి ఉద్దేశం అయితే.. ఈ సినిమా చాలామందిని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది.
సెటిల్డ్ గా ఎలా నటించాలో బీజూ మీనన్ పాత్రల్ని చూస్తే అర్థమైపోతుంది. బేబీ పాత్రలో ఈసారీ ఆయన అదే చేశాడు. బీజూ మీనన్ ఎప్పుడూ కొత్త తరహా కథలే ఎంచుకొంటాడని అనుకొన్న వాళ్లకు ఈసారి ఆయన కథల ఎంపిక అంతగా రుచించకపోవచ్చు. దసరా, అంబాజీ పేట బ్యాండు మేళం చిత్రాలతో షైన్ టామ్ చాకో మన తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యాడు. తనదో విలక్షణమైన పాత్రగా చూపించే అవకాశం ఉంది. కానీ దాన్ని సరిగా వాడుకోలేదు. ఈ క్యారెక్టర్ గ్రాఫ్ మరింత పెంచి ఉంటే కథలో ఉత్కంఠత వచ్చేది. ఈ రెండూ మినహాయిస్తే… ఈ కథలో చెప్పుకోదగిన పాత్రలేం కనిపించవు.
సాంకేతికంగానూ ఈ సినిమా పెద్ద గొప్పగా అనిపించదు. కథలో మలుపులు ఆశించలేం. ఇదో స్లో డ్రామా అంతే. యాక్షన్ కి చోటు లేదు. పాటల అవసరం రాలేదు. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం గురించి కొత్తగానూ చెప్పుకోవడానికి ఏం లేదు. దర్శకుడు కాపీ వ్యవహారంతో ఈ కథని మొదలెట్టి, అట్నుంచి ఎక్కడికో వెళ్లి, మళ్లీ కాపీ కొట్టడం దగ్గర ఆగాడు. ఆ రకంగా.. కాపీ కొట్టే విధానాలెన్నో కొన్ని సన్నివేశాల ద్వారా చూపించాడు. కానీ ఆ కథని నడపడంలో మరో ఆసక్తికరమైన ఎలిమెంట్ ని జోడించడంలో పూర్తిగా విఫలం అయ్యాడనే చెప్పాలి