”గురువారం మార్చి 1, సాయింత్రం ఫైవ్ ఫార్టీ…” అంటూ గురువారాన్ని తలచుకొంటూ అందంగా పాట పాడుకొన్నాం కానీ, గురువారం అంటే… చిత్రసీమకు చేదు జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. సాధారణంగా కొత్త సినిమా రిలీజ్ అంటే శుక్రవారమే. కానీ అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు గురువారం వస్తుంటాయి. అదో స్ట్రాటజీగా మొదలైంది. ఒకేవారం రెండు మూడు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నప్పుడు ఓ సినిమా గురువారం రావడం ఆనవాయితీగా మారుతూ వస్తోంది. అయితే గురువారం విడుదలైన సినిమాల పరిస్థితి ఈమధ్య దారుణంగా తయారయ్యాయి. కనీసం వాటికి ఓపెనింగ్స్ లేవు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా శుక్రవారం నుంచైనా కలక్షన్లు పెరగాలి. కానీ.. అదీ జరగడం లేదు. గురువారం సినిమా విడుదలైతే ఇక ఖేల్ ఖతం అన్నట్టు తయారైంది పరిస్థితి. గత కొంత కాలంగా ఇదే జరుగుతోంది. ఈ గురువారం ‘ఓదెల 2’ విడుదలైంది. తమన్నా ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. సంపత్‌నంది దర్శకుడు. ఈ సినిమాకు మంచి బజ్ వుంది. రివ్యూలు కూడా ‘యావరేజ్’ సినిమా అన్నాయి. అయితే.. దానికి తగిన వసూళ్లయినా ఉండాలి కదా? గురువారం థియేటర్లన్నీ బోసిబోయాయి. ఇంత పబ్లిసిటీ చేసినా జనాలు థియేటర్లకు ఎందుకు రాలేదో అర్థం కాలేదు. చివరికి ఇది గురువారం ఎఫెక్ట్ అని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి.
కొత్త సినిమా అంటే శుక్రవారమే అనేది సగటు ప్రేక్షకుల మైండ్ సెట్ కి పాకేసింది. పైగా వీకెండ్ మొదలవుతుంది. కాబట్టి సరదాగా సినిమాలపై ఓ లుక్ వేయొచ్చు. గురువారం అనేది వీక్ డేనే. కాబట్టి థియేటర్లకు రావడం కష్టం. కొత్త సినిమాలనే కాదు, స్వతహాగానే గురువారం అనేసరికి బాక్సాఫీస్ చల్లబడిపోతుందని, విడుదలై హిట్ టాక్ సంపాదించుకొన్న సినిమాలకు సైతం గురువారం వసూళ్లు ఉండవని, అసలు గురువారం బాక్సాఫీసుకు ‘హాలీడే’గా ప్రకటించినా పెద్ద నష్టమేం కలగదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నాని లాంటి హీరోలకు గురువారం సెంటిమెంట్. తన సినిమాలు ఎక్కువగా గురువారమే విడుదలయ్యాయి. హిట్ టాక్ తెచ్చుకొన్నాయి. ‘హిట్ 3’ కూడా గురువారమే రాబోతోంది. పెద్ద సినిమాలకు ఓకే కానీ, చిన్న, మీడియం రేంజ్ సినిమాలు గురువారానికి కాస్త దూరంగా ఉంటే మంచిదేమో?