ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెల్చుకున్న 23 నియోజకవర్గాల్లో ఒకటి చీరాల. అసలు టిక్కెట్టే దక్కదనుకున్న కరణం బలరాం కుటుంబానికి .. చివరి క్షణంలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడంతో చంద్రబాబు అప్పటికప్పుడు ఆలోచించకుండా టిక్కెట్ ఆఫర్ చేశారు. దీంతో సడెన్‌గా చీరాలలోకి ఎంట్రీ ఇచ్చిన కరణం బలరాం గెలిచేశారు. ఇలా గెలుపునకు ఆమంచి పై వ్యతిరేకత ఎక్కువగా ఉపయోగపడింది. అయితే ఆ తర్వాత కరణం కూడా వెళ్లి వైసీపీలో చేరడంతో ఇప్పుడా పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అవుతోంది.
పర్చూరు.. అద్దంకి సీట్లు ఆఫర్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ చీరాల టిక్కెట్ తన కుమారుడు వెంకటేష్‌కు ఇవ్వాలన్న షరతుతోనే బలరాం వైసీపీలో చేరారు. ఆ ప్రకారం వైసీపీ నేతలు కూడా హామీ ఇచ్చారు. అయితే ఒకప్పుడు ఇండిపెండెంట్‌గా గెలిచి గ్రామ గ్రామాన సొంత వర్గం పెట్టుకున్న ఆమంచి కృష్ణమోహన్ తన స్థానాన్ని వదిలేందుకు సిద్ధంగా లేరు. తనకు చీరాల కావాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. హైకమాండ్ పిలిచి ఆయనకు పర్చూరు సీటు ఆఫర్ చేసింది. కానీ ఆయన వద్దనేశారు. వెళ్లేందుకు సిద్ధపడటం లేదు. చీరాలలోనే రాజకీయం చేస్తున్నారు.
ఇప్పుడు చీరాల వైసీపీలో మూడు వర్గాలు బలంగా ఉన్నాయి. కరణం బలరాంతో వచ్చిన వారు ఎక్కువగా టీడీపీ వారు. అధికారం ఉందని ఆయన వెంట ఉంటారు. కరణం కుమారుడు వెంకటేష్ఆవేశంతో చేసే రాజకీయాలను ఆమంచి వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే వారి వైపే వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆమంచికి సొంత వర్గం ఉంది. ఆయన ఏ పార్టీలో ఉంటారు. మరో వైపు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా చీరాల నుంచి రాజకీయం చేస్తున్నారు. ఆమెకు కూడా ఓ వర్గాన్ని మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉండే ఈ పరిస్థితులు వైసీపీలో కనిపిస్తున్నాయి. ముందూ వెనుకా చూసుకోకుండా నేతల్ని చేర్చుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.
గ్రామాల్లో ఇప్పుడు వైసీపీలో ప్రతి గ్రామంలోనూ.. రెండు, మూడువర్గాలున్నాయి. ప్రధానంగా ఆమంచి, కరణం వర్గీయులు ఎప్పటికప్పుడు గొడవలు పడుతూంటారు. కేసులు పెట్టుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఒకరికొకరు కలిసి పని చేసే పరిస్థితి లేదు. మరో వైపు చీరాలకు తెలుగుదేశం పార్టీ తరపున ఓ బీసీ నేతకు చాన్సిచ్చారు. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆ నేతను వ్యూహాత్మకంగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. చివరికి పోటీ .. ఆమంచి.. కరణంల మధ్యే ఉంటుందని… ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.
ఇప్పటికైతే ఆమంచి జనసేన వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. టీడీపీతో పొత్తు ఉంటే.. చీరాల సీటు తీసుకుంటారని.. అది తనకు ఇస్తారని హామీ వస్తే ఆయన అందులో చేరిపోయే అవకాశం ఉంది. గతంలో వైసీపీ హైకమాండ్ చెప్పినట్లుగా టీడీపీ, జనసేనతో పాటు న్యాయమూర్తులపైనా ఇష్టారీతిన బూతులు మాట్లాడిన ఆమంచి ఇటీవల సైలెంట్ అయ్యారు. మొత్తంగా చీరాలలో ఇతర పార్టీలతో కన్నా.. వైసీపీ తనలో తాను తేల్చుకోవడానికి కుస్తీలు పడుతుందని అనుకోవచ్చు.