ఏపీ ప్రభుత్వం పండగ సీజన్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. ఇందులో రేట్లను యాభై శాతం అధికంగా వసూలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. బస్సు ఓ వైపు నుంచి ఖాళీగా వస్తుందని .. అందుకే అదనపు చార్జీలుగా భావించవవద్దని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. అదీ కూడా ఏపీకి ఎక్కువ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. కానీ ఒక్క రూపాయి కూడా అదనపు చార్జీ వసూలు చేయబోమని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
ఇప్పుడు హైదరాబాద్‌ను విశాఖ వెళ్లాలంటే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రూ. వెయ్యి అయితే.. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో రూ. పదిహేను వందలవుతుంది. దీంతో ఎవరైనా ఏ బస్ టిక్కెట్లు బుక్ చేసుకుంటారు ? ఏపీఆర్టీసీ ఆదాయాన్ని తెలంగాణ ఆర్టీసీ చాలా ప్లాన్డ్గా కైవసం చేసుకుంటోంది. ఏపీప్రయాణికుల్ని తమ వైపు రప్పించాలంటే టిక్కెట్ రేట్ల తగ్గింపే మార్గం అనుకుని ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీ లేకుండా చేస్తే చాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేయడం వల్ల ఏపీ బస్సులు ఖాళీగా వెళ్తాయి. తెలంగాణ బస్సులు ఫుల్‌గా వెళ్తాయి.
ఏపీ, టీఎస్ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏపీ నుంచి ఎన్ని బస్సులు తెలంగాణకు వస్తే .. తెలంగాణ కూడా అన్ని బస్సులను ఏపీకి నడుపుకోవచ్చు.గతంలో ఏపీ ఆర్టీసీ బస్సులే విజయవాడకు 90 శాతం వెళ్లేవి. ఇప్పుడు యాభై శాతం అయ్యాయి. మిగిలిన యాభై శాతం టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి. ప్రత్యేక బస్సుల్లోనూ ఇదే కోటా. ఏపీ ఆర్టీసీ రేటు పెంచినా తెలంగాణ పెంచకుండా ఆ రద్దీని తాను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించడం ప్రారంభించింది. ఏపీ ఆర్టీసీకి మాత్రం ఇవేం పట్టింపు లేదు. రేటు తగ్గించేది లేదని చెబుతోంది. సినిమా టిక్కెట్లతో పోల్చి నెటిజన్లు విమర్శలు చేస్తున్నా.. పట్టించుకునేవారే లేరు.