సంక్రాంతి అంటేనే కొత్త సినిమాలు. ప్రతీ యేటా ముగ్గుల పండక్కి పెద్ద సినిమాల జాతర సహజం. ఈసారీ అంతే. ఏకంగా 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రోజుకో సినిమా చొప్పున.. పండగ రోజులన్నీ సినిమాలకే అంకితం చేయొచ్చు. ఈ సీజన్లో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి కూడా కారణం అదే. భారీ వసూళ్లు రాబట్టుకోవొచ్చని. అయితే… ఈ పండక్కి సినిమాల మాట సరే కానీ, ఆ వినోదం మధ్యతరగతి ప్రేక్షకుడికి అందుబాటులో ఉంటుందా, లేదా? అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే తెలంగాణలో ఈ పండగ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టికెట్ రేట్లు పెంచేశారు.
సింగిల్ స్క్రీన్లో అయితే రూ.250, అదే మల్టీప్లెక్స్ లో అయితే రూ.400 వరకూ టికెట్ రేట్లు ఉన్నాయి. ఏదో ఓ సినిమా అంటే.. ఫర్వాలేదు. పండక్కి వస్తున్న నాలుగు సినిమాలూ, అందులోనూ కుటుంబ సమేతంగా చూడాలంటే మాత్రం మధ్య తరగతి వర్గానికి కష్టమే. హైదరాబాద్ లో ఓ సినిమాని కుటుంబ సమేతంగా, మల్టీప్లెక్స్ లో చూడాలంటే దాదాపు రూ.3 వేలు సమర్పించుకోవాల్సిందే. నాలుగు సినిమాలూ చూడాలంటే రూ.12 వేలు. బెనిఫిట్ షోల టికెట్లు మరింత ప్రియం. గుంటూరు కారం సినిమా టికెట్ దాదాపుగా రూ.1500 నుంచి రూ.2 వేలకు పలికే ఛాన్సుంది. పండక్కి… ప్రేక్షకులు ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టుకోక తప్పేట్టు లేదు. తొలి వారం అంతా ఇదే స్థాయిలో రేట్లు ఉంటాయి కాబట్టి, ఓ వారం ఆగాక సినిమాకి వెళ్దామనుకొన్నవాళ్లే ఎక్కువ ఉండొచ్చు. లేదంటే… ఓటీటీకి వచ్చేంత వరకూ ఆగొచ్చు అనుకోవచ్చు. అయితే ఈ టికెట్ ధరలు సినిమాని బట్టి ఉంటుంది. `హనుమాన్`కి పెరిగిన టికెట్ ధరలు వర్తించకపోవొచ్చు.