భారీ తగ్గింపు ధరలు అనే బోర్డులు షాపింగ్ మాల్స్ దగ్గర కనిపిస్తాయి. ప్రొడెక్ట్ ని వినియోగదారులకు దగ్గర చేయాలంటే, వాళ్లకు అలవాటు చేయాలంటే ఇదో చక్కటి మార్గం కూడా. తక్కువ లాభాలొచ్చినా చాలు, లేదంటే గిట్టుబాటు ధర వచ్చినా చాలు అనుకొంటే ఈ పంధా అనుసరించాల్సిందే. చిన్న సినిమాలకూ ఇది వర్తిస్తుంది. ‘చిన్న సినిమాలకు జనం రావట్లేదు’ అని బెంగ పడడం కంటే, ప్రేక్షకులకు సినిమా చేరువ కావాలంటే ఏం చేయాలన్నది నిర్మాతలు ఆలోచించాలి. మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే రూ.150 నుంచి రూ.200 సమర్పించుకోవాల్సిన తరుణంలో, స్టార్ హీరోల సినిమాలక్కూడా జనాలు బయటకు రాని పరిస్థితుల్లో చిన్న సినిమా రేట్లు తగ్గించడం మేలైన మార్గం. ‘పేక మేడలు’ టీమ్ ఇప్పుడు అదే చేస్తోంది.
ఈనెల 19న ‘పేకమేడలు’ విడుదల అవుతోంది. అంతకు ముందే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి లాంటి నగరాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనుంది. ఈ షో టికెట్ కేవలం రూ.50 లకే అందుబాటులో ఉంచింది. ఓరకంగా ఇది మంచి ఆలోచన. సినిమా బాగుందన్న నమ్మకం నిర్మాతలకు ఉన్నప్పుడు, ముందే తక్కువ రేటుకి సినిమాని అందుబాటులో ఉంచితే, నిజంగా సినిమా బాగుంటే, ఆటోమెటిగ్గా టికెట్ ఎంత ఉన్నా, జనం థియేటర్లకు వస్తారు. రూ.50లకే సినిమా టికెట్ అంటే సినిమాకు ఫ్రీగానూ పబ్లిసిటీ వస్తుంది. ఓరకంగా చిన్న సినిమాలన్నీ ఈ ఐడియాను ఫాలో అయితే మంచి ఫలితాలు వస్తాయేమో..? వినోద్ కిషన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నీలగిరి మామిళ్ల దర్శకుడు. టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందనే వచ్చింది.