సినిమా టికెట్ల అమ్మకాల వ్యవహారం మొత్తం ఏపీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవాలన్న నిర్ణయం… టాలీవుడ్ కే హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి ఇదేమంత తెలివైన చర్య కానే కాదు. ఓ రకంగా టాలీవుడ్ ని భయపెట్టడం లాంటిది. టాలీవుడ్ పై జగన్ ప్రభుత్వానికి ఉన్న మమకారం ఏమిటో తెలియంది కాదు. ఇప్పటికే జగన్ చర్యలు… టాలీవుడ్ పతానానికి ఇదోదికంగా సాయం చేస్తూ వచ్చాయి. అందులో ఇదొకటి.
జగన్ నిర్ణయంపై టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. కానీ ఎవ్వరూ నోరు మెదపడం లేదు. ఏం మాట్లాడితే ఏమైపోతామో.. అన్న భయం వాళ్లది. సినిమా వాళ్లకు వ్యాపారాలున్నాయి.భూములున్నాయి. లోలోపల లొసుగులు చాలా ఉన్నాయి. వాటన్నింటిపైనా తమ వాక్కులు ప్రభావం చూపిస్తాయన్న భయం. అందుకే ఇంతమంది బడా హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఉన్నా అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారంతే. ఈ నిశబ్దం వెనుక మరికొన్ని మతలబులూ ఉన్నాయి. జగన్ మొండిఘటం. తాను అనుకున్నది చేసి తీరతాడంతే. ఇప్పుడు ఈ విషయంలో టాలీవుడ్ అంతా ఏకమై నిరసన తెలిపినా – జగన్ ఆగడు. పైగా మరింత మొండితనంతో తాను చేయాలనుకున్నవన్నీ అమలు పరిచి తీరతాడు. ఎలాగూ… ఆపలేం కదా.. అన్న నిర్లిప్త వైఖరి టాలీవుడ్ మౌనానికి ఓ కారణం కావొచ్చు. లేదంటే.. ఈ వ్యవహారంపై ఎవరైనా కోర్టుకెళ్లడం ఖాయం. కోర్టు జగన్ సర్కారుకి మొండి చేయి చూపించడం ఇంకా గ్యారెంటీ… అన్న నమ్మకాలూ ఉండొచ్చు.
అసలు ఈ పోర్టల్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దాని వల్ల ఎవరికి ఎలాంటి లాభం? ఈ విషయంపై చాలామంది నిర్మాతలకే ఇంకా స్పష్టత లేదు. అలాంటప్పుడు ఏం మాట్లాడతారు? ఎవరిని విమర్శిస్తారు? అందుకే అంతా వేచి చూసే ధోరణిలో పడిపోయారు. ఇప్పటికే ఏపీలో టాలీవుడ్ పరిస్థితేం బాలేదు. ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తే.. మరింత క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కోవాల్సివస్తుంది. ఎలాగూ.. ఈ టికెటింగ్ వ్యవస్థ వర్కవుట్ అవ్వదు.. అలాంటప్పుడు ఇప్పుడు గొడవ పడాల్సిన అవసరం ఏముందన్న నమ్మకంతోనే ఎవ్వరూ నోరు మెదపడం లేదు.అందుకే… టికెట్ల అమ్మకానికి తలూపేసి – జగన్ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.