తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటేనే వారసత్వ రాజకీయాలు. పై స్థాయి నుంచి అందరూ తన రాజకీయ నేత హోదాను వారసులకు ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు ఆది కాంగ్రెస్ లో కొత్త కల్లోలానికి కారణం అవుతోంది. తమతో పాటు తమ వారసులకూ టిక్కెట్లు ఇవ్వాలని నేతలు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ లో ఇప్పటికే ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అన్న షరతు ఉంది. దీంతో తమ స్థాయిలో తాము ఒత్తిడి తెచ్చేందుకు ఆయా నేతలంతా రెడీ అయ్యారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తనకు, తన భార్య పద్మావతికి టిక్కెట్లు ఇవ్వాలని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారు. సీనియర్ నేత జానారెడ్డి టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు కానీ ఆయన ఇద్దరు కుమారులిద్దరికీ మిర్యాలగూడ, నాగార్జున సాగర్ టిక్కెట్ కావాలని కోరుకంటున్నారు. దామోదర రాజనర్సింహ , సీతక్క , కొండా సురేఖ , , అంజన్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా తమ వారసుల్ని రంగంలోకి దించుతున్నారు.
విచిత్రం ఏమిటంటే.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతలే కాదు.. పార్టీలో ఇంకా చేరని వారు కూడా రెండు టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తో పాటు ఆమె భర్త శ్యాంనాయక్ కూడా టిక్కెట్ అడుగుతున్నారు. ఇద్దరిలో ఒకరికి కాదు..ఇద్దరికీ ఇవ్వాలంటున్నారు. ఇక ఇంకా పార్టీలో చేరని.. చేరుతారో లేదో తెలియని మైనంపల్లి హన్మంతరావు ప్రధాన డిమాండ్ కూడా అదే. ఆయనతో పాటు ఆయన కుమారుడికి మెదక్ టిక్కెట్ కేటాయించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ గతంలో ఉదయ్ పూర్ లో నిర్వహించిన ప్లీనరీలో ఒక కుటుంబానికి ఒక్క టిక్కెటే కేటాయించాలని తీర్మానించారు. ఇప్పుడు ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒక్కటే కేటాయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒక్కటే కేటాయిస్తే.. కొంత మంది నేతలు అలగడం ఖాయం.