సినిమా పూర్తయ్యేంత వరకూ… ఒకలా, పూర్తయిన తరవాత మరోలా వ్యవహరిస్తుంటారు కొంతమంది నిర్మాతలు. డబ్బుల విషయంలో మరీనూ. ముందు ఎంతో కొంత అడ్వాన్సు రూపంలో చేతిలో పెట్టి.. అప్పుడిస్తా – ఇప్పుడిస్తా అంటూ కాలయాపన చేస్తారు. ‘సినిమా విడుదల ముందు అంతా క్లియర్ చేస్తా..’ అంటూ కొంత కాలం ‘సినిమా విడుదలయ్యాక ఫస్ట్ పేమెంట్ మీకే’ అని ఇంకొంత కాలం వాయిదా వేస్తారు. చివరికొచ్చేసరికి నష్టాలూ, కష్టాలూచూపించి చేతులెత్తేస్తారు. టైగర్ చిత్రబృందానికీ ఇదే పరిస్థితి ఎదురైంది.
సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ కథానాయకులుగా నటించిన చిత్రం టైగర్. ఈ సినిమా వచ్చి యేడాదైపోయింది. అయినా… చిత్రబృందానికి ప్రొడ్యూసర్ పేమెంట్లు మొత్తం సర్దుబాటు చేయలేదని తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ… కొంత మొత్తం ఎగ్గొట్టారట. అసలు కథానాయిక సీరత్ కపూర్‌కి పైసా కూడా ఇవ్వలేదట. ఆమె ప్రొడ్యూసర్ ఠాగూర్ మధుకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా.. అవతల అత్తాపత్తా లేదట. సందీప్ కిషన్ పరిస్థితీ ఇంతే అని తెలుస్తోంది. ‘శాటిలైట్ అవ్వనివ్వండి అప్పుడు సర్దుతా’ అని చెప్పుకొచ్చిన ప్రొడ్యూసర్, ఆ బిజినెస్ జరిగిపోయినా డబ్బులు తీయడం లేదని న్యూస్.