గుంటూరు కుర్రాడు తిలక్ వర్మ వీరోచిత ఇన్నింగ్స్ వల్ల ఇంగ్లండ్ పై రెండో టీ ట్వంటీ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ భారత్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై భారత బ్యాటర్లు తలబడ్డారు. ఓదశలో… ఓటమి ఖాయమనుకొన్నారు కూడా. అయితే టెయిల్ ఎండర్ల సహకారంతో తిలక్ (72 నాటౌట్) భారత్‌ని గట్టెక్కించాడు. చివరికి 2 వికెట్ల తేడాతో విజయం అందుకొని, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఏ బ్యాటరూ నిలదొక్కుకోలేకపోయాడు. ఓవైపు సిక్సర్లు కొడుతున్నా, మరోవైపు వికెట్లు పడ్డాయి. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బట్లర్ (45) రాణించాడు. అనంతరం భారత బ్యాటింగ్ ధాటిగానే ప్రారంభమైనా క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. ఓ దశలో 85 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ చక్కటి ఆటతీరు ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బౌలర్లని ధీటుగా ఎదుర్కొని బౌండరీలు సాధించాడు. ఆరో వికెట్ భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో సుందర్ (26) ఔటయ్యాడు. ఆ తరవాత మరో రెండు వికెట్లు పడ్డాయి. తొమ్మిదో వికెట్ రూపంలో వచ్చిన రవి బిష్ణోయ్ (9) సహకారంతో ఈ మ్యాచ్‌ని తిలక్ వర్మ గెలిపించాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ 4 ఓవర్లలో 4 ఓవర్లలో 60 పరుగులు ఇవ్వడం విశేషం. ఆర్చర్ బౌలింగ్ లో భారీగా పరుగులు పిండుకోవడంతో భారత్ ఈ మ్యాచ్ గెలవగలిగింది. లేదంటే.. ఛేదన కష్టమయ్యేదే.