ఐపీఎల్ లో ముంబైకి మరో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో.. లక్నో చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిచేదే. కానీ చేచేతులా పరాజయం కొని తెచ్చుకొంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తూ చేస్తూ కీలకమైన సమయంలో రిటైర్డ్ ఔట్ గా వెనుదిరగడం జట్టు విజయావకాశాల్ని దెబ్బ తీసింది. 23 బంతుల్లో 24 పరుగులు చేశాక పెవీలియన్ చేరడం జట్టు ఓటమికి ప్రధాన కారణం. తిలక్ దూకుడుగా బ్యాటింగ్ చేయగలడు. ఒక్కో ఓవర్లో 20 పరుగులు పిండుకొనే సత్తా ఉన్న బ్యాటర్. కానీ తాను నిదానంగా ఆడడం, బౌండరీలు బాదడంలో విఫలం అవ్వడంతో ముంబై పై ఒత్తిడి పెరిగింది.
కీలకమైన దశలో తిలక్ పెవీలియన్ చేరడాన్ని ముంబై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కావాలని తిలక్ నిదానంగా ఆడాడని, ఫిట్ గా లేకపోతే.. ఇంపాక్ట్ ప్లేయర్ గా మరో ఆటగాడ్ని పంపించాల్సి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు. దీనిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు. ఓటమికి ఒక్కరినే నిందించడంలో లాభం లేదని, గెలపైనా ఓటమైనా సమష్టి బాధ్యతని గుర్తు చేశాడు. సరైన సమయంలో వేగంగా పరుగులు చేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని వ్యాఖ్యానించాడు.
2 ఓవర్లలో 29 పరుగులు చేయాలనుకొన్నప్పుడు క్రీజ్‌లో పాండ్యా, తిలక్ ఉన్నారు. ఇద్దరూ హిట్టర్లే. పైగా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది. ఈ దశలో తిలక్ చాలా నిదానంగా ఆడాడు. బౌండరీలు బాదడంలో విఫలం అయ్యాడు. 19 ఓవర్ చివరి బంతి ముందు రిటైర్ ఔట్ గా పెవీలియన్ చేరాడు. ఆ ఓవర్లో కనీసం 15 పరుగులు వచ్చినా ముంబై విజయాన్ని అందుకొనేది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడలేదు. తనని బెంచ్‌కే పరమితం చేశారు. రోహిత్ లాంటి అనుభవజ్ఙుడ్ని, వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.