తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారే టైం వచ్చేసింది. ఆయన తో బీజేపీ కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతోంది. కానీ తలసాని ఎన్నికల తరవాత అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ బయటకు తీసిన గొర్రెల స్కాం కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగిపోయింది.
గొర్రెల స్కామ్ లో 700 కోట్ల అవినీతి జరిగింది.. పెద్ద మొత్తం లో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు ఉన్నాయని కేసులు నమోదు కావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గొర్రెల స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ కుంభ కోణానికి కారకులు ఎవరు.. ఎవరెవరి పాత్ర ఉంది .. ఎవరెవరికి నగదు చేరింది అన్నది లెక్కలు తీయనున్నారు. ఇదే జరిగితే కేసు ఎవరి దగ్గరకు వెళ్తుందో చెప్పాల్సిన పని లేదు., ఇప్పటికే ఏసీబీ .. తలసాని పీఏను అరెస్టు చేసింది.
అసలు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా.. తెలంగాణ పోలీసులు నమోదుచేసిన కేసులో ఈడీ వివరాలు అడిగిందంటేనే… ఓ సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తలసాని కూడా రంగంలోకి దిగుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ నిర్వీర్యం అయింది. ఎంపీ అభ్యర్థికి లక్షన్నర ఓట్లు కూడా రాలేదు. సనత్ నగర్లోనూ కనీస ఓట్లు రాలేదు. దీంతో బీజేపీలోకి వెళ్లడానికి తలసాని ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కనిపించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.